కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బీజేపీ నేత, ప్రస్తుత హోం మంత్రి బసవరాజ్ బొమ్మై నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటిసారి యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా మెజార్టీ లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన కూడా రెండేళ్లు కాకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. నాలుగో సారి బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అవుతున్నారు. మూడేళ్లలో ముగ్గురు సీఎంలు నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ అధిష్టానం కర్ణాటకలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇస్తారని ఆశించినా అది నెరవేరలేదు. లింగాయత్ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తే పార్టీ మనుగడ సాగించడం కష్టమని భావించి వారినే సీఎంగా చేయాలని భావించారు. దీంతో యడ్యూరప్ప సూచించిన వ్యక్తికే సీఎం పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలపై యడ్యూరప్ప రాజీనామా చేసినప్పుడు సదానంద గౌడను ఆయన సూనలతోనే నియమించారు. ఇప్పుడు బసవరాజ్ బొమ్మైను కూడా యడ్యూరప్పే సూచించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పేరు అధిష్టానం దృష్టిలో లేకపోయినా యడ్యూరప్ప సూచించడంతో ఆయననే ఖరారు చేశారు. తాను గవర్నర్ గా వెళ్లదలుచుకోలేదని రాష్ర్ట రాజకీయాల్లోనే ఉంటానని యడ్యూరప్ప చెప్పారు. ఒక దశలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగినా చివరకు విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే బాధ్యత యడ్యూరప్ప పైనే ఉందని అధిష్టానం భావిస్తోంది.
అయితే కర్ణాటక రాజకీయాల్లో యడ్యూరప్పే చక్రం తిప్పుతారని తెలుస్తోంది. తన ప్రధాన అనుచరుడికే పదవి ఇప్పించడంతో యడ్యూరప్పదే పెత్తనం అనే వార్తల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు ఎటు వైపు వెళతాయో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. దీంతో అసంతృప్తులను బొమ్మై సరి చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్లను తన దారికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.