బంగ్లాదేశ్ టాప్ హీరోయిన్ పోరీ మోనీ డ్రగ్స్ ఉపయోగిస్తోందని, విక్రయిస్తోందని, అనుమతి లేకుండా విదేశీ మద్యం కలిగి ఉందనే ఆరోపణలతో అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. బంగ్లా రాజధాని ఢాకా బనానీలో ఉన్న పోరీ మోనీ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు, అధికారులు ఆమెను అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత డ్రగ్స్, విదేశీ మద్యం గురించిన వివరాలు వెల్లడించారు. అయితే.. సాధారణ సమయంలో ఈ విషయాన్ని అందరూ నమ్మేవారేమోగానీ.. ఇక్కడ వేరే సందర్భం కూడా ఉంది. తనపై అత్యాచార యత్నం చేశారంటూ ఓ రాజకీయ నాయకుడి స్నేహితుడిపై కేసు పెట్టిన మరుసటి రోజే ఈ కేసు నమోదవడం, రాత్రికి రాత్రే ఆమెను అరెస్టు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
హీరోయిన్ పోరీ మోనీ ఇంట్లో నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని, విదేశీ మద్యం లభించిందని, అందుకే ఆమెను అరెస్టు చేశామని రాబ్ వింగ్ డైరెక్టర్ మోయిన్ తెలిపారు. పక్కా సమాచారం రావడం వల్లనే సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. అయితే.. ప్రముఖ రాజకీయ నాయకుడి స్నేహితుడు తనపై జూన్ 8న అత్యాచారయత్నం చేశాడని పోరీ మోనీ పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెపై ఈ కేసు నమోదు చేయడం పట్ల సంచలనం రేకెత్తించింది.
అయితే.. తాను కేసు పెట్టినా.. నిందితుడిని అరెస్టు చేయలేదంటూ పోరీ మోనీ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మీడియా ముందు ప్రధాని షేక్ హసీనాకు విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ లైవ్ లో పోరీమోనీ మాట్లాడుతూ.. తనను చంపేస్తారేమోనని భయంగా ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రధానిని కోరింది. పోలీసుల మీద తనకు నమ్మకం లేదని ఆరోపించింది.
కాగా.. ఇలా ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేశారు. డ్రగ్స్, విదేశీ మద్య దొరికిందని చెప్పి అరెస్టు కూడా చేశారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అయితే.. ఆమెపై ఓ క్లబ్ మేనేజ్ మెంట్ కూడా కేసు పెట్టింది. పోరీ మోనీ డ్రగ్స్ తీసుకొని తమ క్లబ్ పై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇందులో విశేషం ఏమంటే.. పోరీమోనీపై అత్యాచయత్నం కేసులో జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి ఆ క్లబ్ డైరెక్టర్ గా ఉన్నాడు. దీంతో.. హీరోయిన్ అరెస్టుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.