తెలుగు నాట రాజకీయం చేయాలంటే ఉట్టి ఒక పార్టీ పెడితే సరిపోదు. తిమ్మిని బమ్మిని చేసేలా ఆ పార్టీకి తోడుగా బలమైన మీడియా ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో నిలబడగలం.. ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పిగొట్టగలం.. జనాల్లోకి తీసుకెళ్లగలం. అది లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాదరణ కరువవుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో ఉన్న బలం, బలగం బయట లేదని పోయిన ఎన్నికల్లోనే తేలిపోయింది. ఎందుకంటే తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు బలమైన మీడియా, టాప్ మీడియా అంతా టీడీపీ చేతుల్లోనే ఉంది.ఇక దానికి పోటీగా వైసీపీకి కొన్ని మీడియా,.పత్రికలున్నా వాటి బలం సరిపోవడం లేదు. దీంతో టీడీపీ మీడియా రాజకీయాలను శాసించేలా ఉంది.
అందుకే జగన్ ను చాలా సార్లు కార్నర్ చేస్తూ టీడీపీ మీడియా, చంద్రబాబు అండ్ కో ఆడుకుంటున్న పరిస్థితి. ఇక చంద్రబాబుతో విడిపోయి బీజేపీతో కలిసిన జనసేనాని పవన్ కు ఇప్పుడు అటు టీడీపీ మీడియా, ఇటు వైసీపీ మీడియా పట్టించుకునే వారేలేరు. సోషల్ మీడియాతో సాధారణ ప్రజల వద్దకు పవన్ కళ్యాణ్ చేరే అవకాశం కనిపించడం లేదు.
ఇదే బాధ జనసైనికుల్లోనూ వ్యక్తమవుతోంది. అందుకే తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను ఓ జనసేన అభిమాని ట్విట్టర్ లో అడిగేశారు. ‘పవన్ కళ్యాన్ ను ఆదరించాలంటే ఓ న్యూస్ చానెల్ అవసరమని.. అది మీరు పెట్టాలని. దానికి జనసైనికులం అండగా ఉంటాం’ అంటూ పవన్ అభిమాని ట్విట్టర్ లో బండ్ల గణేష్ ను కోరారు. దానికి రీట్వీట్ చేసిన బండ్ల గణేష్ ఆమోదాన్ని తెలిపారు.
పవన్ తో త్వరలోనే బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తో వచ్చే లాభాలతోనే ఈ సినిమాను బండ్ల గణేష్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే జనసేనకు ఒక మీడియా సొంతమైనట్టే. వారి వాయిస్ ప్రజల్లోకి వెళ్లినట్టే..