
Bandi Sanjay: తెలంగాణలో ఎన్నిలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు పొత్తులు, ఎత్తులపై సమాలోచనలు మొదలు పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కూడా పొత్తులపై స్పందిచారు. కీలక ప్రకటన చేశారు. బీజేపీని అడ్డుకొనేందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎవరు కలిసినా.. తాము మాత్రం సింహం లాగా సింగిల్‌గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
టీడీపీతో పొత్తుపై క్లారిటీ..
కొద్ది రోజులుగా టీడీపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం నడుమ పార్టీ నేతలు స్పష్టత కోరుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ దీని పైన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని వెల్లడించారు. బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్‌ఎస్..కాంగ్రెస్ కలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. పొత్తు పైన కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహి అని సంజయ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే బిల్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో గిరిజనుల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీక్‌పై ఎందుకు మాట్లాడడం లేదు..
పబ్లిక్ సర్వీసు కమిషన్ పేపర్ లీక్‌పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యుడైన కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్‌తో ముడిపెడుతూ గిరిజన రిజర్వేషన్లపై జాప్యం చేస్తున్నారని.. దమ్ముంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు పెంచాలని సవాల్ చేశారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలవకుండా కేసీఆర్ రూ.కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టగానే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా అభివృద్ధి చేస్తామని సంజయ్ స్పష్టం చేశారు.

మొత్తంగా తెలంగాణ ఎన్నికలను సింగిల్‌గానే ఎదుర్కొంటామని అటు టీడీపీకి, ఇటు సొంత పార్టీ నేతలకు బండి క్లారిటీ ఇచ్చేశారు. ఇక మిగిలింది ఎన్నిల సమరమే..