రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రైతులకు సంఘీభావం బండి సంజయ్ ఒకరోజు ఉపవాస దీక్ష చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆయన నాంపెల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపవాస దీక్ష చేపడుతున్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేరుతో రైతుల సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు 30వేల కోట్లు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం జరగడం లేదన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసే వారు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వమే ప్రతీ గింజ కొంటామని చెబుతున్నా జాప్యం చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదన్నారు.
రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపట్టినట్లు బండి సంజయ్ ప్రకటించారు. ఈమేరకు నేడు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు పూనుకున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులందరు ఇంట్లోనే ఉపవాస దీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యుత్సాహంతో బీజేపీ శ్రేణులు రోడ్లేక్కద్దని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. బండి సంజయ్ ఉపవాస దీక్షకు పూనుకోవడం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.