Bandi Sanjay arrest : నిన్నరాత్రి మునుగోడుకు బయలుదేరుతూ హైదరాబాద్ లో నడిరోడ్డుపై ధర్నా చేసి పోలీసులకు చమటలు పట్టించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమంగా ఉన్నారంటూ బండి సంజయ్ మునుగోడుకు బయలు దేరారు. నిన్న అర్ధరాత్రి ఆయన్ను రామోజీ ఫిలిం సిటీ వద్ద అడ్డుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మఫ్టీలో, యూనిఫాంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ లోపలికి పోనీయకుండా.. అటు బండి సంజయ్ ను బయటకు రాకుండా కాపు కాస్తున్నారు. పకడ్బందీగా భద్రత కల్పించారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యేవరకూ బండి సంజయ్ ను బీజేపీ ఆఫీసులోనే ఉంచాలని పోలీసులు నిర్ణయించారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళి, జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు బండి సంజయ్ ఆరా తీశారు. అక్కడ ఓటింగ్ జరుగుతున్న తీరును అక్రమాలపై నాయకులతో సంభాషించి తెలుసుకున్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ దాడులకు, ప్రలోభాలకు వెరవకుండా పోలింగ్ సజావుగా సాగేలా, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని బండి సంజయ్ కోరారు.
మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండి మరీ రాత్రంతా నియోజకవర్గంలో ప్రభావితం చేశారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఆయన్ను మునుగోడుకు వెళ్లకుండా నిన్నటి నుంచి అడ్డుకుంటున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి సైతం మునుగోడులో ధర్నాలు, ఆందోళనతో అట్టుడికిస్తున్నారు. ఇంతటి ఉద్రిక్తతల వేళ మునుగోడు ఓటరు ఎవరికి ఓటు వేస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది.