KTR vs Bandi Sanjay : టీఆర్ఎస్.. బీజేపీ.. పాతిక‌ ల‌క్ష‌ల క‌థ‌!

ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు.. ప‌ది ల‌క్ష‌లు దాటి పాతిక ల‌క్ష‌ల చుట్టూ తిరుగుతున్నాయి. గులాబీ సర్కారు ‘ద‌ళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప‌థ‌కం కోసం 500 కోట్లు విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం.. హుజూరాబాద్ లో మొద‌టి విడ‌త‌గా 15 మందికి చెక్కులు అందించింది. అయితే.. మొద‌టి నుంచీ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు ఏమంటే.. ఈ ప‌థ‌కం రాష్ట్రం మొత్తం అమ‌లు చేయ‌డం అసాధ్య‌మ‌ని! అస‌లు.. హుజూరాబాద్ లోనే ల‌బ్ధిదారులంద‌రికీ ఇవ్వ‌ర‌ని! […]

Written By: Bhaskar, Updated On : August 17, 2021 6:15 pm
Follow us on

ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు.. ప‌ది ల‌క్ష‌లు దాటి పాతిక ల‌క్ష‌ల చుట్టూ తిరుగుతున్నాయి. గులాబీ సర్కారు ‘ద‌ళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప‌థ‌కం కోసం 500 కోట్లు విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం.. హుజూరాబాద్ లో మొద‌టి విడ‌త‌గా 15 మందికి చెక్కులు అందించింది. అయితే.. మొద‌టి నుంచీ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు ఏమంటే.. ఈ ప‌థ‌కం రాష్ట్రం మొత్తం అమ‌లు చేయ‌డం అసాధ్య‌మ‌ని! అస‌లు.. హుజూరాబాద్ లోనే ల‌బ్ధిదారులంద‌రికీ ఇవ్వ‌ర‌ని! కేవ‌లం.. ఉప ఎన్నిక దాటేందుకే ద‌ళిత బంధును తెడ్డులా వాడుకుంటున్నార‌ని!

అయితే.. ప్ర‌భుత్వం మాత్రం అమ‌లు చేసి తీరుతామ‌ని చెబుతోంది. మొద‌టి విడ‌త‌లో 500 కోట్లు విడుద‌ల చేశామ‌ని, రెండు వారాల్లో మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌లు రిలీజ్ చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. మొత్తంగా రెండు నెల‌ల్లో హుజూరాబాద్ లో ల‌బ్ధిదారులంద‌రికీ ఈ ప‌థ‌కం అందిస్తామ‌ని చెప్పారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పాక్షికంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. దీంతో.. విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచాయి. చేత‌ల్లో దూకుడు పెంచాయి.

ద‌ళిత బంధును రాష్ట్రం మొత్తం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఓ కార్య‌క్ర‌మం తీసుకుంది. బీజేపీ నేత‌లు ఊరూరా వెళ్లి ద‌ళిత బంధుకోసం ల‌బ్ధిదారుల‌తో ద‌ర‌ఖాస్తులు చేయించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ద‌ళితులంద‌రికీ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చేంత వ‌ర‌కూ ఊరుకునేది లేద‌ని అల్టిమేటం జారీచేశారు బండి సంజ‌య్‌. ఈ నేప‌థ్యంలో.. మంత్రి కేటీఆర్ బండిపై సెట‌ర్ వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇస్తామ‌న్న రూ.15 ల‌క్ష‌ల కోసం సంజ‌య్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డం బాగుంద‌ని, మంచి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌గా అంద‌రికీ ఇప్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు కేటీఆర్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

2014 ఎన్నిక‌ల‌కు ముందు న‌ల్ల‌ధ‌నంపై మోడీ ఓ రేంజ్ లో హామీలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దేశ సంప‌ద మొత్తం స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంద‌ని, అది మొత్తం ర‌ప్పిస్తాన‌ని చెప్పారు. అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోనే బ్లాక్ మ‌నీ వెన‌క్కు తెప్పించి, ప్ర‌తీ కుటుంబానికి రూ.15 ల‌క్ష‌లు అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఈ మేర‌కు జ‌న్ ధ‌న్ ఖాతాలు కూడా తెరిచారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా వేయ‌లేదు.

ఇప్పుడు.. ఇదే విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విధంగా.. ఎవ‌రికి రాజ‌కీయం వారు చేస్తున్నారు. బండి సంజ‌య్ ఆ ప‌దిహేను ల‌క్ష‌ల గురించి మాట్లాడ‌లేదుగానీ.. ఈ ప‌ది ల‌క్ష‌లు మాత్రం అంద‌రికీ ఇచ్చి తీరాల్సిందేన‌ని అంటున్నారు. అటు కేటీఆర్ కూడా ఖ‌చ్చితంగా అంద‌రికీ ప‌ది ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్ప‌కుండా.. ముందు ప్ర‌ధాని నుంచి రావాల్సిన డ‌బ్బులు ఇప్పించాల‌ని ట్వీట్లు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజ‌న్లు.. ఈ రెండు పార్టీలూ జ‌నాల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి త‌ప్ప‌.. అంద‌రికీ ఇచ్చేదేమీ ఉండ‌ద‌ని కామెంట్ చేస్తున్నారు.