Bandaru Satyanarayana : చంద్రబాబును అరెస్ట్ చేస్తావా? పవన్ ను సీఎం చేసి రోజా, జగన్ పై రెచ్చిపోయిన బండారు

రోజా పై తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు అన్నట్టు బండారు సత్యనారాయణ సంకేతాలు ఇచ్చారు.

Written By: Dharma, Updated On : October 12, 2023 1:07 pm

chandrababu1

Follow us on

Bandaru Satyanarayana : టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల కిందటే మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ బండారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు బండారు సత్యనారాయణమూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖలో అరెస్టు చేసి గుంటూరు తరలించారు. చివరకు కోర్టులో బెయిల్ లభించడంతో బండారు సత్యనారాయణమూర్తి బయటకు వచ్చారు. అయినా సరే తన దూకుడును తగ్గించలేదు. తాజాగా మరోసారి సీఎం జగన్ తో పాటు మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను బండారు సత్యనారాయణమూర్తి పరామర్శించారు. వారిని చూసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మరో వంద రోజుల్లో ఏపీలో బలమైన ప్రభుత్వం వస్తుందని హెచ్చరించారు. జగన్ నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలకు ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్కు తెలియదు అనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నిన్ను దొంగ అనాలా? గజదొంగ ఆనాలా? తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి రోజాపై మరోసారి బండారు సత్యనారాయణమూర్తి కామెంట్స్ చేశారు. రోజా గురించి తెలుసు కాబట్టి వైసీపీలో ఉన్న సోదరీమణులు ఎవరు స్పందించలేని విషయాన్ని గుర్తు చేశారు. గుంటూరు పోలీసులు 41 నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే తాను వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను పాటించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. రోజా పై తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు అన్నట్టు బండారు సత్యనారాయణ సంకేతాలు ఇచ్చారు.

32 రోజులుగా చంద్రబాబును జైలు జీవితానికి పరిమితం చేసిన జగన్కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పవన్ తో కలిసి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆయన అవసరమైతే పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామని ప్రకటించారు. టిడిపి శ్రేణులను విస్మయపరిచారు. బండారు నువ్వు వదిలేస్తే లేనిపోని వివాదాలు తెచ్చి పెడతారని టిడిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే రోజాపై వ్యాఖ్యలతో కొంత డ్యామేజ్ జరగగా.. ఇప్పుడు పవన్ సీఎం అని ప్రకటించి తప్పు చేశారని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు సమయం మనం పాటించాలని బండారు సత్యనారాయణమూర్తికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.