TDP: చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ తర్వాత టిడిపిలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. న్యాయస్థానంలో ఊరట దక్కితే రాజకీయంగా దూకుడు పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. జైలు నుంచే పావులు కదుపుతున్నారు. వైసీపీ కీలక నాయకులకు చేర్చుకొని జగన్కు గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డిని టిడిపిలో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో పాటు రాయలసీమ ఉద్యమకారులు కొంతమందిని పార్టీలో చేర్చుకొని టికెట్లు కేటాయించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా వైసీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల తారాస్థాయికి చేరుకున్నాయి. వైవి సుబ్బారెడ్డి పట్టు బిగిస్తుండడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఆయన టిడిపి నుంచి వైసీపీ గూటికి చేరారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తొలి రోజుల్లో వైవి అండతో బాలినేని మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తొక్కాలని ప్రయత్నించారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తనకు ఎదురు తిరగడంతో బాలినేని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి స్నేహ హస్తం అందించారు. ఏ నిర్ణయం తీసుకున్న కలిసే తీసుకుందామన్న రీతికి ఆ ఇద్దరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు టిడిపి కీలక నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాలినేని ఒంగోలు ఎంపీ స్థానంలో నిలబెట్టి.. మా గుంట శ్రీనివాసుల రెడ్డిని నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించాలని టిడిపి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి నేతలు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని స్థానిక టిడిపి శ్రేణులు అధినాయకత్వాన్ని కోరుతున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్కు సమీప బంధువు. అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం గత ఎన్నికలకు ముందు టిడిపిలో ఉండేవారు. పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. కానీ ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగా లేకపోవడంతో టీడీపీ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో బలంగా కనిపిస్తోంది. మంచి నాయకత్వం సైతం ఉంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం రెండు స్థానాలు సాధించుకుంది. ఇప్పుడు దాదాపు స్వీప్ చేసినంత ధీమా కనబరుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీకి భారం అవుతారని జిల్లా నాయకత్వం భావిస్తోంది. అయితే ఎన్నికల ముంగిట జగన్కు దెబ్బ కొట్టాలంటే ఇటువంటి కీలక నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని అధినాయకత్వం భావిస్తోంది. మొత్తానికైతే ఆ ఇద్దరు కీలక నాయకులు టిడిపికి టచ్ లోకి రావడంతో అధికార వైసీపీలో గుబులు రేపుతోంది.