Balakrishna: నందమూరి కుటుంబంలో విభేదాలునిజమేనని మరోసారి తేలింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబంలో దాదాపు అందరూ స్పందించినా.. హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా నైనా సానుభూతి తెలపలేదు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా తారక్ స్పందించని వైనం పై బాలయ్య స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. అనురాగం,ఆత్మీయత అంతా ఓ బూటకం అని తేల్చేశారు. ఇన్నాళ్లకు బాలయ్య బాబుకు తెలిసి వచ్చిందన్నమాట. ఇంతకాలం మీరు ఆయన్ను అనాథ లెక్క చూశారు. ఆయన ఇప్పుడు వైసీపీ తో రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఈ రివెంజ్ డ్రామా ఇప్పట్లో ఆగదు ఆగదని ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఇటు పోయింది మాత్రం మీ పరువేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సంయమనం పాటించాలని కోరుతున్నారు.
చంద్రబాబు అరెస్టు జరిగి దాదాపు నెల రోజులు సమీపిస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయన రిమాండ్ ఖైదీగా గడుపుతున్నారు. ఒక్క వైసీపీ నేతలు తప్పించి.. మిగతా వారంతా చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అటు నందమూరి, ఇటు నారా కుటుంబ సభ్యులు సైతం స్పందించారు. చివరకు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఖండించారు. ఎందరు ఖండించిన ఒకే ఒక లోటు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంతవరకు స్పందించకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే ఒరిగేదేమీ లేకున్నా.. నందమూరి కుటుంబం అంతా ఒకే వేదికపై ఉందని చెప్పడానికి ఒక మార్గం దొరికేది.ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ప్రత్యర్థులకు ఇది వరంలా మారింది.
వైసీపీ రివెంజ్ వెనుక తారక్ ఉన్నాడు అన్నది ఒక సంచలనం. అందులో వాస్తవం ఉందో? లేదో? తెలియదు కానీ.. ఆయన స్పందించకపోయేసరికి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాజకీయ వేదికలు పంచుకోవడానికి తారక్ ఇష్టం లేదని అభిమానులు చెబుతున్నారు. మరి ఆ లెక్కన గత ఏడాది హైదరాబాద్ వచ్చిన అమిత్ షాను ఓ హోటల్ కి వెళ్లి మరి తారక్ కలిసిన సందర్భాలు ఉన్నాయి. అమిత్ షా సినిమా నటుడు కాదు. సినిమా రంగానికి చెందిన ప్రముఖుడు కాదు. ఆయన ఓ రాజకీయ వేత్త. ప్రస్తుతం దేశంలో ప్రముఖ నాయకుడు. ఆయన్ని కలిసేందుకు తీరిక ఉంది కానీ.. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు జైలుకు వెళితే కనీసం తారక్ స్పందించకపోవడంపై తెలుగుదేశం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు బాలయ్య బాబు సైతం బాధపడడానికి అదే కారణం. అందరం ఉన్నా చంద్రబాబును బయటకు తేలేకపోతున్నామన్న బాధ బాలయ్య బాబుని వెంటాడుతోంది. పనిలో పనిగా తారక్ గురించి విలేకరులు అడిగేసరికి.. ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం చెప్పేశారు. అనురాగాలు, ఆత్మీయతల గురించి ఓపెన్ అయ్యారు. అంటే వ్యక్తిగతంగా వారి మధ్య ఏవేవో వివాదాలు ఉన్నట్లు అర్థమవుతుంది. దానిని గుర్తు చేసుకునే బాలయ్య బాబు తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తారక్ తమవాడని కుటుంబం భావించలేదు.. అందుకే ఇప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉన్న తమ వారిని తారక్ భావించలేదు. అంతకు మించిన లాజిక్ ఏమీ లేదని.. అంత దానికి తారక్ ను నిందించడం సరైన చర్య కాదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే తమ మధ్య పెద్ద అగాధమే ఉందని.. ఐ డోంట్ కేర్ అన్న మాటతో బాలయ్య బాబు బయట పెట్టేశారు.