Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయకులను తయారుచేసింది. తెలుగు రాష్ట్రాలకు అందించింది. ముఖ్యంగా బీసీ నేతలకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి బీసీ నాయకులే వెన్నెముక.ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు వారికి ప్రాధాన్యం లభిస్తూ వచ్చింది. అది టిడిపి మనుగడకు అవసరం అయ్యింది కూడా. అయితే కీలక సమయాల్లో తెలుగుదేశం పార్టీలో కుల ముద్ర, ఆశ్రిత పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు నందమూరి బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి నేటి అసెంబ్లీ సమావేశాల వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధినేత అరెస్ట్ అయిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం తప్పులేదు కానీ.. గత నాలుగేళ్లుగా టిడిపి నేతల అరెస్టు సమయంలో బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కింజరాపు అచ్చెనాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు వంటి బీసీ నేతలతో పాటు అశోక్ గజపతిరాజు, దేవినేని ఉమా, నారాయణ వంటి నేతలపై జగన్ సర్కార్ ఎన్నెన్నో కేసులు నమోదు చేసింది. అర్ధరాత్రి అరెస్టులతో బింబెలెత్తించింది. అటువంటి సమయంలో బాలకృష్ణ పెద్దగా కనిపించలేదు. ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అతి చొరవ చూపుతున్నారు. పార్టీకి తానే నెంబర్ 2 అని సంకేతాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో బాలకృష్ణ స్పందించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. టిడిపి నాయకుల విషయంలో వివక్ష చూపకూడదు. బాలకృష్ణ దివంగత ఎన్టీఆర్ కుమారుడే కాదు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. కానీ పార్టీ శ్రేణులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు మాదిరిగానే బయటకు వచ్చి పోరాటం చేయాలని వారు బలంగా కోరుకుంటున్నారు.