Balakrishna- Gudivada: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన వ్యూహ రచన చేస్తుంటే.. మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో చెందిన కీలక నేతలను ఓడించడం ద్వారా అధికార వైసీపీని దెబ్బకొట్టాలని విపక్షాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేనాని, టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడపై ఫోకస్ పెట్టారు.

గుడివాడను దక్కించుకోవాలి..
గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కొడాలి నాని గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. సీనియన్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ వీరాభిమాని అయిన కొడాలి నాని. తన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలు పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ హయాంలోనే గుడివాడ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో అసెంబ్లీ బరిలో నిలిచి గెలిచారు. నానికి గుడివాడలో మంచి పట్టు ఉంది. తర్వాత అనూహ్య పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జగన్‌కు కుడిభుజంగా మారారు. నాని అంటే గుడివాడ, గుడివాడ అంటే నాని అన్నంతగా నియోజకవర్గం మారిపోయింది. దీంతో గుడివాడని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నారు. నానిని దెబ్బకొట్టే అభ్యర్థి వేట మొదలు పెట్టారు టీడీపీ అధినేత.
టీడీపీ గుట్టంతా నానికే ఎరుక..
పుటు పూర్వమంతా మేనమామకెరుక అన్నట్లు.. టీడీపీ గుట్టు.. వ్యూహాలన్నీ కొడాలి నానికి తెలుసు. సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేసినందున ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో నాని ఊహించగలడు. ఆ పార్టీ నేతల బలాలు, బలహీనతలు అంచనా వేయగలడు. ఈ నేపథ్యంలో వీలైనప్పుడల్లా టీడీపీ అధినేతను, ఆయన కొడుకు లోకేష్‌ను తనదైన శైలిలో రచ్చకీడుస్తున్నారు. టీడీపీ నేతలనూ చీల్చి చెండాడుతున్నారు. ఈ క్రమంలో నానిని ఓడించడం ద్వారా అతడిని దెబ్బతీయడంతోపాటు గుడివాడను తమ ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
బరిలోకి బాలయ్య..
కృష్ణాజిల్లా రాజకీయాల్లో గుడివాడకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు బలమైన నేతగా ఉంది కొడాలినానినే. వైసీపీలోకి రాకముందు టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని మార్చింది నానినే. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగా సైకిల్ దిగి ఫ్యాన్ అందుకున్న కొడాలి నాని తిరుగులేని నేతగా గుడివాడని ఏలేస్తున్నారు. ఇప్పుడలాంటి గుడివాడలో కొడాలికి చెక్ పెట్టేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధని గుడివాడ బరిలో దింపాలని బాబు భావిస్తున్నారు. ఈమేరకు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రాధాతో కొడాలిని ఢీకొట్టడం సాధ్యం కాదని టీడీపీ అధినేత భావించారు. దీంతో గుడివాడ బరిలో తన వియ్యంకుడు, నందమూరి తారకరామారావు వారసుడు బాలకృష్ణను బరిలో నిలపాలని చూస్తున్నారు. నాని కూడా ఎన్టీఆర్ వీరాభిమాని అయినందున దూకుడు తగ్గిస్తారని, విమర్శల దాడి తగ్గుతుందని, గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు ఆలోచన. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గుడివాడ అభ్యర్థి బాలయ్యే అని టీడీపీ అధినేత ఫిక్స్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జనసేన నుంచి అవినాష్..
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చూస్తున్నారు. అందులో భాగంగా గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నాని అనుచరులు పాలంకి సారధిబాబు, మోహన్ బాబులిద్దరూ కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీలో చేరారు. కొడాలి నాని తీరు నచ్చకనే పవన్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు కూడా నోటికి అదుపులేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దురుసు మాటలతో విమర్శలు చేశారు. దీనిపై పలుమార్లు ఇరుపార్టీలనేతలతోపాటు ఆపార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎలాగైనా సరే కొడాలినానికి గుడివాడలో చెక్ పెట్టాలని పట్టుదలతో ఉన్నాయి.

ఈక్రమంలో పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరడంతో ఆపార్టీకి కలిసొచ్చింది. కొడాలినానిపై పోటీచేసేందుకు సరైన అభ్యర్థి పాలంకి బ్రదర్సేనని మొదట భావించారు. అయితే గత ఎన్నికల్లో నానిపై టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్‌ను కూడా మళ్లీ నానిపై పోటీ చేయించాలని కూడా జనసేనాని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటటమి తర్వాత అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. ఆయనను జనసేనలో చేర్చుకుని నానిపై మళ్లీ పోటీకి దింపాలని పవన్ భావిస్తున్నారు. ఈమేరకు పార్టీ నేతలను రంగంలోకి దించారు జనసేనాని. అవినాష్‌కు నియోజకవర్గంలో పట్టు ఉండడం, గత ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతి ప్రజల్లో ఉన్నందున వచ్చే ఎన్నికల్లో వీటిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు జనసేన అధినేత.