Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఈరోజు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్నటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగియగా.. వర్చువల్ విధానంలో ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును సిఐడి అధికారులు ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల వాదనను విన్న కోర్ట్ చంద్రబాబు రిమాండ్ కే మొగ్గుచూపింది. చంద్రబాబు క స్టడీ, బెయిల్ పిటిషన్ లపై నేడు కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అందులో భాగంగా విచారణ కీలకం కానుంది.
గత రెండు రోజులుగా కస్టడీ, బెయిల్ పిటిషన్ లపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా ఇరువర్గాలు వాదనలు వినిపించమన్నారు . చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దుబే, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈరోజు బెయిల్ పిటిషన్ లో చంద్రబాబు లాయర్ దూబే వాదనలకు ఏఏజీ సుధాకర్ రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయాలని వాదించనున్నారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని.. అందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం పట్టించుకోకుండా చంద్రబాబు 13చోట్ల సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తన వాదనలు వినిపించారు.
ఈరోజు ముందుగా బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. అనంతరం సిఐడి కి కస్టడీ ఇచ్చే విషయంలో విచారణ జరపనున్నారు. తమకు మరోసారి కస్టడీకి ఇస్తే స్కిల్ స్కాం కేసులో మిగతా విషయాలపై దర్యాప్తు చేస్తామని సిఐడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును కస్టడీకి ఇచ్చారు. అప్పట్లో సిఐడి 5 రోజులు పాటు కస్టడీకి కోరితే కోర్టు మాత్రం రెండు రోజులే అవకాశం ఇచ్చింది. ఏదైనా కేసులో అనుమానితుడ్ని అరెస్టు చేస్తే.. 15 రోజుల్లోపే కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపునాలుగు వారాలు పూర్తవుతుంది.దీంతో కష్టడికి ఇవ్వడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈనెల తొమ్మిదిన విచారణకు రానుంది. సాధారణంగా పైకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే.. కింది కోర్టు బెయిల్ కానీ, కస్టడికి ఇచ్చేందుకు అంతగా మొగ్గు చూపదు. ఈ లెక్కన చంద్రబాబుకి బెయిల్ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అటు సిఐడి కస్టడికి ఇచ్చే ఛాన్స్ ఉండదని ఒక అంచనా. ప్రధానంగా ఈరోజు కోర్టులో జరిగే విచారణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.