వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రతి రోజు లేఖలు రాస్తూ ఏదో ఒక సమస్యను తెరమీదకు తెస్తున్నారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలపై లేఖలు సంధిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మీడియా ముందుకు రాలేకపోతున్న ఆయన లేఖలు రాస్తూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు.
సర్పంచులు,ఉపసర్పంచులకు సంయుక్తంగా చెక్ పవర్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ తాజాగా రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే స్థానిక పరిపాలన అంశాన్ని పట్టించుకోవాలని సూచించారు. గాంధీజీ కలలు కన్న పరిపాలనపై దృష్టి సారించాలని కోరారు. పల్లెలు ప్రగతి సాధించాలంటే వాటికి స్వయం పాలన అధికారం కట్టబెట్టాలన్నారు.
గ్రామ సచివాలయాల్లో వలంటీర్లు, సర్పంచ్, ఉపసర్పంచులకు జవాబుదారీతనం ఉండటం లేదని వాపోయారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ వ్యవస్థను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. జీవో నెం2 దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని పేర్కొన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వలంటీర్లు పని చేస్తున్నారని వాపోయారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. వలంటీర్లతో అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వలంటీర్ల వ్యవస్థ గొడ్డలిపెట్టుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.