BRS B FORMS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 3న నోటిషికేషన్ విడుద కానుంది. తొలి వారంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. అయితే అందరికంటే ముందే 115 స్థానాలకు 114 మందికి టికెట్లు ప్రకటించారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. నాగులు స్థానాలు మాత్రమే పెండింగ్ పెట్టారు. అయితే నాలుగు రోజులుగా అభ్యర్థులకు బీఆర్‌ఎస్ బీఫామ్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ప్రకటించిన అభ్యర్థుల్లో పది మందికి బీఫామ్స్ అందలేదు. దీంతో వారిలో టెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.
పది బీఫామ్స్ పెండింగ్..
బీఆర్‌ఎస్‌లో ఇంకా పది మందికిపైగా బీఫామ్స్ అందని నేతలు ఉన్నారు. అందరికీ బీఫామ్స్ ఇచ్చారు కానీ వీరికి మాత్రం పెండింగ్ పెట్టారు. అందరికీ ఒకే సారి కాకుండా మూడు రోజులుగా పంపిణీ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ 105 మందికి మాత్రమే బీఫామ్స్ పంపిణీ చేసినట్లుగా బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ పది మందికిపైగా బీఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15న 69 మందికి, ఆ మరుసటి రోజు 28 మందికి కేసీఆర్ బీఫాంలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించని నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలు కూడా ఉన్నాయి.
మార్పు తప్పదా..
బీఫామ్స్ అందని వారిని మారుస్తారని తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారని చెబుతున్నారు. అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఎమ్మెల్యే అబ్రహంను కలిసేందుకు ప్రయత్నించినా కేటీఆర్, కేసీఆర్ అవకాశం ఇవ్వడంలేదు. స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించినా మూడు రోజులు బీఫామ్ ఇవ్వలేదు. అక్కడ తానే అభ్యర్థిగా ఉంటానంటూ రాజయ్య చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఉత్కంఠకు తెర దించుతూ గురువారం ప్రగతి భవన్‌లో కడియం శ్రీహరికి బీఫామ్ ఇచ్చారు. విడత వారీగా బీఫామ్స్ ఇస్తున్నారని, అభ్యర్థులను మార్చకపోవచ్చని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఆలంపూర్ అబ్రహం పేరును మాత్రం మారుస్తారని అంటున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని.. కొంత మంది ఆశావహులు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి బీఆర్‌ఎస్‌లో చివరి నిమిషయంలో ఏం జరుగుతుందో చూడాలి.