
ప్రచారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిన్న గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె కాలికి గాయాలయ్యాయి. మమతపై జరిగిన దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదరవుతోంది. ఈ దాడి ఘటనను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు తృణమూల్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతపై దాడి జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇందులో భాగంగా ఆమె అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మరోవైపు.. నందిగ్రామ్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: పవన్ కల్యాణ్ కు సపోర్టుగా లగడపాటి
దీని నుంచి గట్టెక్కడానికి బీజేపీ పావులు కదుపుతోంది. పక్కా ప్లానింగ్ ప్రకారమే మమతా బెనర్జీపై చోటు చేసుకుందంటూ బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. బీజేపీ ఏపీ రాష్ట్రశాఖ నాయకులు కూడా దీన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఘటనను ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న కోడికత్తి దాడితో పోల్చుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో సానుభూతిని పొందడానికే ఇలాంటి కృత్రిమ దాడులు చేయించుకున్నారని ఆరోపిస్తోన్నారు. బీజేపీ రాష్ట్రశాఖ నాయకుడు లంకా దినకర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
తాజాగా.. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై చోటు చేసుకున్న దాడిని, 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి అటాక్‌తో పోల్చారు లంకా దినకర్. ఈ రెండు దాడుల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఉందంటూ పరోక్షంగా ఆరోపించారు. మమతా బెనర్జీపై దాడిని ఆయన జగన్ కోడికత్తి పార్ట్-2గా అభివర్ణించారు. ఈ రెండు ఉదంతాలు కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనల మేరకే చోటు చేసుకున్నాయనే అర్థాన్ని వచ్చేలా ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో తమపై దాడులు చేయించుకోవడం వల్ల, ఆ నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టొచ్చని, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని భావిస్తున్నట్లు లంకా దినకర్ పేర్కొన్నారు.
Also Read: పాత రేషన్ విధానమే బెటర్ అంట
లంకా దినకర్ సుదీర్ఘకాలంపాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారనే కారణంతో కొంతకాలం పాటు ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. కొద్దిరోజుల కిందటే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తేశారు. అప్పటి నుంచి క్రియాశీలకంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఈ ట్వీట్ వివాదం రేపుతోంది. దినకర్ వ్యాఖ్యలు చూసిన వారంతా ఇప్పుడు ఆలోచనలు పడ్డారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్