ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యల అమలులో తడబపడుతున్న విషయం తెలిసిందే. టెస్టులు జరుగుతున్నాయి…. కుప్పలు తెప్పలుగా కేసులు బయటకు వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా పరిస్థితి మెరుగుపడిన జాడ కనిపించడం లేదు. అటు ఢిల్లీలో దాదాపు 90% కి పైగా రికవరీ రేటు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకి మరణాల సంఖ్య కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక రాష్ట్రంలో సామాన్యుని నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఈ మహమ్మారికి భయపడుతున్నారు. ఇదే సమయంలో టిడిపి సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. జుడిషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.
ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో వైసిపి కుట్రపూరితంగా కేసులు పెట్టి అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. ఇక ఈ సమయంలో అతనికి కరోనా సోకడం పై వారు నానా రాద్ధాంతం చేయడం ఖాయం. అదీ కాకుండా అఫీషియల్ గా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడుకి ఇలా పాజిటివ్ అని తేలడంతో కుటుంబసభ్యులు, అభిమానులు కార్యకర్తలు, ఆందోళన చెందుతున్నారు. ఇక టిడిపి వారు కావాలని జగన్ ప్రభుత్వం అతని పట్టించుకోవట్లేదని…. చివరికి అతనికి కరోనా వచ్చేదాకా వారి నిర్లక్ష్యం వెళ్లిందని ఎన్నో ఆరోపణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా టిడిపి వర్గాల్లో వాతావరణం కనిపిస్తోంది. అదుపులో ఉన్న మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది వారి ప్రశ్న.
ఈఎస్ఐ మందుల స్కాం లో అరెస్టయిన అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించారు. జూన్ 12న అచ్చెన్నాయుడు స్వగ్రామంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా ఎసిబి అదుపులోకి తీసుకుంది. అయితే వీరిలో అచ్చెన్నాయుడుకి కరోనా సోకడం ఇప్పుడు తీవ్ర వివాదం లేపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జగన్ చంద్రబాబు కు ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే ఇప్పటికే అమరావతి విషయమై కక్కలేక మింగలేక ఉంటున్న బాబు చెలరేగిపోవడం ఖాయం.