Armoor TRS MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు జీవన్ రెడ్డిపై హత్యా యత్నం చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం సంచలనం కలిగిస్తోంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేపై దాడికి తెగబడాలని ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. నేరపూరిత కార్యకలాపాలు దాదాపు తగ్గుముఖం పట్టిన తరుణంలో ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకోవడం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రజాప్రతినిధులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని అనుకోవడం సాధారణమైన విషయమేమీ కాదు. కానీ అలాంటి ఆలోచన రావడమే గమనార్హం.

ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలితపై దాదాపు 30 వేల మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెం. 12లోని వేమూరి ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు ఓ వ్యక్తి తచ్చాడుతూ కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిందితుడు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వాడిగానే గుర్తించారు. కిల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త గా చెబుతున్నారు. తన భార్య సర్పంచ్ ను సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్న అతడు ఆయనపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అతడికి పిస్టోల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. నేర ప్రవృత్తిలో మారణాయుధాల పాత్ర ఎంతో ఉందని తెలుస్తున్న క్రమంలో అతడికి ఆ ఆయుధం ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఇదివరకు అతడిపై ఏవైనా కేసులు ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అతడి గత చరిత్ర ఏమిటి? ఎందుకు ఎమ్మెల్యేపై దాడి చేయాలని అనుకుంటున్నాడు. ఒకటే కారణమా? ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అని నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భార్య పదవి పోవడానికి కారణమైన ఎమ్మెల్యేపైనే దాడి చేయాలని భావించిన నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.