
ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి అక్కడి రాజకీయ పరిణామాలు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలకన్నా ఇప్పుడు అసోం పైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా అసోంపైనే దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాయి. ఇక్కడే ఈజీగా బయటపడొచ్చని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నికలో అసోం గణపరిషత్‌తో కలిసి బీజేపీ బరిలోకి దిగింది. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), బోడో పీపుల్స్ ఫ్రంట్, ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలతో మహాఘట్ బంధన్‌గా ఏర్పడి కాంగ్రెస్ బరిలోకి వచ్చింది.
అసోం అంటే తేయాకు కార్మికుల సంఖ్య ఎక్కువ. తేయాకు పంటకు పెట్టింది పేరు ఈ రాష్ట్రం. వీరి మద్దతు ఎవరికి దొరికితే వారు గెలుపొందుతారనేది ఇక్కడి సెంటిమెంట్. అందుకే.. ఇప్పుడు ఈ జాతీయ పార్టీలు తేయాకు కార్మికుల చుట్టూ తిరుగుతున్నాయి. సుమారుగా ఇక్కడ 68,465 చిన్న, 825 పెద్ద తేయాకు తోటలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రాష్ట్ర జనాభాలో 17 శాతం వీరిదే. అసోం రాష్ట్రంలో 126 నియోజకవర్గాలు ఉండగా.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో వీరు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతటి శక్తి ఉన్న వీరిని ప్రసన్నం చేసుకునేందుకు జాతీయ పార్టీల నేతలు దొరికిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
ఇప్పటికే పలువురిని దర్శనం చేసుకున్న ఈ ఇరు పార్టీల నేతలు.. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ లేనిపోని హామీలు ఇస్తూనే ఉన్నారు. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో తేయాకు కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. సరైన గిట్టుబాటు కూలీ లేదు. పిల్లలకు ఎలాంటి విద్యా సదుపాయాలు లేవు. వీరికోసం ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. వీటిని ఆసరాగా చేసుకున్న ఇరు పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే తేయాకు కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు నిర్మిస్తామని చెబుతున్నారు. వారి పిల్లల కోసం ప్రత్యేక విద్యాప్రమాణాలు కల్పిస్తామంటున్నారు. కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్నారు.
2016లో ఇలాంటి హామీలతోనే బీజేపీ రంగంలోకి దిగింది. వారిని నమ్మిన తేయాకు కార్మికులు మద్దతు పలికారు. రాష్ట్ర సీఎం పీఠం అప్పజెప్పారు. అయితే.. ఆ హామీలన్నింటినీ ఆ తదుపరి తుంగలో తొక్కిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల తేయాకు కార్మికులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఏకంగా కార్మికులతో కలిసి తేయాకు కోశారు. ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఓ తేయాకు కార్మికురాలితో కలిసి భోజనం చేశారు. వీటన్నింటినీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తేయాకు కార్మికులను మచ్చిక చేసుకోవడంలో బీజేపీ కన్నా ఒక అడుగు ముందే ఉన్నట్లుగా అర్థమవుతోంది. మరి ఈ ఎన్నికల్లో తేయాకు కార్మికులు ఏ పార్టీకి మద్దతునిస్తారో చూడాలి.