Homeఆంధ్రప్రదేశ్‌హైకోర్టులో సవాల్ చేసిన అశోక్‌ గజపతిరాజు

హైకోర్టులో సవాల్ చేసిన అశోక్‌ గజపతిరాజు

మహరాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు చైర్మన్‌గా సంచయితను నియమించడంతో పాటు.. మాన్సాస్‌ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్టు మాజీ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన ఆ రెండు జీవోల అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ మంగళవారం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విజయనగరంలో తమ తాత అలక్‌ నారాయణ్‌ గజపతి పేరుతో 1958లో స్థాపితమైన ట్రస్టుకు తమ తండ్రి పీవీజీ రాజు, సోదరుడు ఆనందగజపతిరాజు చైర్మన్లుగా వ్యవహరించారని, ఈ ట్రస్టుకు చైర్మన్‌ లేదా ప్రెసిడెంట్‌గా కుటుంబంలో పెద్దవాడైన పురుష వారసుడే ఉండాలని ట్రస్టు దస్తావేజుల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

అదే విధంగా సొసైటీ ప్రెసిడెంట్‌ మాత్రమే కౌన్సిల్‌/బోర్డుకు ఇద్దరు స్వతంత్ర సభ్యులను, వ్యవస్థాపక కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను నామినేట్‌ చేయగలరని పేర్కొన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్‌ యాక్టు ప్రకారం ఈ నిబంధనలన్నీ రిజిస్టరై ఉన్నాయని తెలిపారు. ఆ నిబంధనల మేరకు 2016 వరకు ఆనందగజపతిరాజు చైర్మన్‌గా వ్యవహరించారని.. ఆయన మరణానంతరం వారసుల్లో పెద్దవాడినైన తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని.. ఇందుకు ప్రభుత్వ సమ్మతి కూడా ఉందని వెల్లడించారు.

చైర్మన్‌గా నిబంధనల మేరకు ఇద్దరు సభ్యులను ట్రస్టుకు నామినేట్‌ చేశానని తెలిపారు. ఈ నేపథ్యంలో గత 3వ తేదీన రాష్ట్ర రెవెన్యూ (దేవాదాయ-2) శాఖ మాన్సాస్‌ ట్రస్టుకు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ముగ్గురిని నియమిస్తూ జీవో 73, చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ జీవో 74ని జారీ చేసిందని తెలిపారు. ట్రస్టు నిర్వహణ కోసం రొటేషన్‌ విధానంలో సంచయితను చైర్మన్‌గా నియమించినట్లు అందులో పేర్కొన్నారని.. ట్రస్టు బైలాలో ‘రొటేషన్‌’ పదమే లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మాన్సాస్‌ చైర్మన్‌గా తమ కుటుంబంలో పెద్దవాడైన పురుష వారసుడు ఉండాలని ట్రస్టు నిబంధనలు చెబుతుండగా, ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని.. ట్రస్టు దస్తావేజులకు విరుద్ధంగా వ్యవహరించడానికి దానికి ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. ట్రస్టు కరస్పాండెంట్‌ నియామకం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 2006లో న్యాయస్థానం సైతం స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పూనుకుందని.. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. తన పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version