AP Three Capitals Issue-YCP: ఏపీలో జగన్ సర్కారు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఏ అంశంతో ఎన్నికలకు వెళ్లాలో తెలియక అంతర్మథనం చెందుతోంది. ప్రజలు ఏ అంశానికి పట్టం కడతారో అని నివేదికలు తెప్పించుకునే పనిలో పడింది. మొన్నటి వరకూ సంక్షేమమే తమ అజెండాగా చెప్పుకొచ్చిన సర్కారుకు మూడు రాజధానుల అంశం ముప్పుతిప్పలు పెడుతోంది. మూడు రాజధానులను అజెండాగా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని భయపడుతోంది. ప్రజల్లో రాజధానిపై ఒకరకమైన అభిప్రాయం ఉంది. అమరావతి తరహాలో అద్భుత రాజధానినే ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యమయ్యే పనికాదు. రహదారులే బాగుచేయని జగన్ మూడు రాజధానులు ఎలా కడతారని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల మనసును గుర్తెరిగిన ప్రభుత్వ పెద్దలు అసలు మూడు రాజధానుల అంశం ఎన్నికల అజెండా కాదని ముందుగానే తేల్చేస్తున్నారు. మూడు రాజధానులకు నమ్ముకుంటే కుక్క తోకతో గోదారి ఈదిన మాదిరి అవుతుందన్నది వారి భావన. అందుకే తమకు అచ్చొచ్చిన సంక్షేమ తారక మంత్రాన్నే నమ్ముకోవాలని భావిస్తున్నారు.

వ్యూహకర్త పీకే ఐ ప్యాక్ బృందం కూడా ప్రజల మనసులో సంక్షేమమే ఉందని గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే వర్కుషాపుల పేరిట సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ గడపగపడకూ వెళ్లి ప్రభుత్వం అందించిన లబ్ధిని గుర్తుచేసి ఓట్లు అడగాలని సూచిస్తున్నారు. నాది మీటనొక్కుడు పని.. ప్రజలకు గుర్తుచేసే పని మీది అంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గీతోపదేశం చేస్తున్నారు. మీకు వేలు, లక్షల రూపాయలు అందించాం కనుక మాకే ఓటు వేయాలని ప్రజలకు గట్టిగానే చెప్పాలని ఆదేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలోకి వెళుతున్న ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సంక్షేమం అనగానే తమకు ఒట్టిగా ఇచ్చారా.. మేము కడుతున్న పన్నులు.. అప్పులు చేసి కదా ఇస్తున్నారంటూ ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరైతే ఒక అడుగు ముందుకేసి మేము అడిగామా? ఎందుకిస్తున్నారు? అన్న రేంజ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కడిగేస్తున్నారు. మాకు అభివృద్ధే కావాలని అడుగుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ఆయుష్షు నాలుగేళ్లు కరిగిపోయింది. ఉన్నది ఒక్క ఏడాది. అది కూడా ఎన్నికల సంవత్సరం. రోడ్లు బాగాలేదు. మౌలిక వసతులు లేవు. అటు రాజధానికి అతీగతీ లేదు. పొలవరం పడకేసింది. చెప్పుకోవడానికి ఇంతో కొంత సంక్షమమే కనిపిస్తోంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో ఏ అంశానికి తెరపైకి తెచ్చినా..సంక్షేమం వెనక్కి వెళ్లిపోతుంది. అసలుకే ఎసరు వస్తుంది. అందుకే సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి పెద్దలు అబ్బబ్బే తమది మూడు రాజధానుల అజెండా కానే కాదు. ముమ్మాటికీ మాది సంక్షేమ అజెండాయే అని చెప్పుకొచ్చే పరిస్థితి వచ్చింది. మనది సంక్షేమమ అజెండా అని.. గడపగపడకూ వెళ్లి అదే చెప్పాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి.

అయితే మూడు రాజధానులపై జగన్ సర్కారులో ఆలోచనలు మారడానికి చాలా కారణాలున్నాయి. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభిమానం చూరగొనవచ్చని భావించారు. కానీ క్షేత్రస్తాయిలో ఆ పరిస్థితి లేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో సాగరనగరవాసులు ఆహ్వానించలేదు. వైసీపీ కృత్రిమ ఉద్యమాలను చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అటు అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రకు స్పందన పెరుగుతోంది. అటు ప్రభుత్వ నిర్ణయం సీమ ప్రజలూ హర్షించడం లేదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మూడు రాజధానులను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని జగన్ భావిస్తున్నారు. అందుకే లక్షల కోట్లు పంచాం.. లక్షల్లో ఓట్లు కొల్లగొడదాం అన్ని నిర్ణయాన్నే ఫైనల్ చేస్తున్నారు. ఆ అంశంతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.