Munugode By Election- Congress: మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ తరహాలోనే కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతంతా మునుగోడులో మకాం వేశారు. మునుగోడులో గౌరవప్రదమైన ఫలితాలు సాధించడం ద్వారా తెలంగాణలో తమ పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఇది ఒకరకంగా అగ్నిపరీక్ష లాంటిదే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, ఫలితాలు వచ్చే సమయానికి కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోనే సాగుతుండటం ఆ పార్టీ రాష్ట్ర నేతలను కలవరపెడుతోంది. మునుగోడు ఎన్నికలకు రాహుల్ యాత్రకు సంబంధం లేదని ప్రెస్‌మీట్లు పెట్టి ప్రకటిస్తున్నారు. అంటే ఫలితం ఎలా ఉన్నా.. దాని ప్రభావం రాహుల్‌పై పడకుండా ఉండాలని భావిస్తున్నారు. కొందరు ఫలితం ముందే తెలిసినట్లు ప్రకటనలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు..
ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి దేశంలో దిగజారుతోంది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. క్రమంగా పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఓటమి చవిచూస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవలే కూలిపోయింది. ఈ క్రమంలో అవసాన దశకు చేరుకున్న పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్రను మొదలుపెట్టిన రాహుల్ గాంధీ.. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో తన పాదయాత్రను ముగించుకుని ఆదివారం తెలంగాణలో అడుగు పెట్టారు.
రాహుల్ యాత్ర టైంలోనే ఉప ఎన్నిక..
ఆదివారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుంది. కేవలం రెండు గంటలపాటే యాత్ర సాగుతుంది. తర్వాత స్థానికులతో రాహుల్ మాట్లాడతారు. మధ్యాహ్నం తర్వాత యాత్రకు విరామం ఇచ్చి రాహుల్ ఢిల్లీ వెళతారు. దీపావళి సందర్భంగా 23, 24, 25 తేదీల్లో విశ్రాంతి తీసుకోనున్నారు. 26 నుంచి తిరిగి యాత్ర మొదలు పెడతారు. నవంబర్ 7వ తేదీ వరకు భారత్‌జోడో యాత్ర తెలంగాణలో సాగుతుంది. ఈ సమయంలోనే అంటే నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 6న ఫలితాలు ప్రకటిస్తారు. అంటే ఉప ఎన్నిక, ఫలితాల ప్రకటన సమయంలో రాహుల్ తెలంగాణలోనే ఉంటారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఎన్నికలకు ముందే చేతులెత్తేశారా?
మునుగోడు ఉప ఎన్నిక, ఫలితాల సమయంలో భారత్ జోడోయాత్ర తెలంగాణలోనే సాగనుండడంతో ఎన్నికకు సంబంధించిన అన్ని రకాల పరిణామాలు, దాని పర్యవసానాలు రాహుల్ గాంధీకి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైతే.. రాహుల్ గాంధీ పాదయాత్రపై ఆ ప్రభావం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో ఫలితం ఎలా ఉన్నా ఆ ప్రభావం రాహుల్‌పై పడకుండా కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మునుగోడు ఉప ఎన్నికకు, రాహుల్ యాత్రకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దీనిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాత్రను మునుగోడు మీదుగా సాగించాల్సింది పోయి.. ఎన్నికకు, యాత్రకు సంబంధం లేదని ప్రకటించడం ఏమిటని గుసగుసలాడుతున్నారు. మరోవైపు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రాహుల్ యాత్ర వేరు మునుగోడు ఉప ఎన్నిక వేరు అని ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే యాత్ర షెడ్యూల్ ఫిక్స్ అయిందని, రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారని తెలిపారు. యాత్ర తెలంగాణలో ఉంది కాబట్టి.. రాహుల్ బాధుడిని చేయాలని చూడడం లేదన్నారు.
మునుగోడులో పర్యటన లేకపోయినా..
రాహుల్ గాంధీ పాదయాత్ర మునుగోడులో లేనప్పటికీ.. ఆ ప్రభావం మునుగోడుపై ఉండేందుకు వీలుగా శంషాబాద్ లేదా ఆ సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఫలితాలు ఏ మాత్రం మెరుగ్గా రాకపోయినా.. రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకోవడం ఖాయమని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోయినా.. ఊరట కలిగించే విధంగా ఫలితాలు సాధించాలని ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

పరిస్థితి మెరుగు పడకపోతే..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఒకటి మునుగోడు ఉప ఎన్నిక, రెండోది రాహుల్ భారత్‌జోడో యాత్ర. ఈ రెండింటిలో ఏది విపలమైనా దాని ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పడుతుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరెండు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందకు రేవంత ప్రయత్నిస్తున్నారు. కానీ, మునుగోడులో పార్టీ పరిస్థితి, సొంతపార్టీ నేతల తీరుపై ఇటీవలే రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఒంటరిని చయాలని చూస్తున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో రాహుల్‌యాత్ర తెలంగాణలోకి ఎంటర్ అయింది. రాహుల్ పర్యటన సందర్భంగా అయినా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే.. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుపడలేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాల తరువాత రాష్ట్రంలోనే పాదయాత్ర చేసే రాహుల్ గాంధీని కలిసి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.