కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర సీఎం మార్పు తథ్యమంటూ వార్తలు వింటూనే ఉన్నాం. ఈ ముహూర్తాన కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నారో.. ఆ ముహూర్తానా సీట్లో కూర్చోబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. తీరా ఆ ముహూర్తాలు వెళ్లిపోతూనే ఉన్నాయి. సీఎం సీటు కేటీఆర్‌కు అందకుండా పోతూనే ఉంది. అయితే.. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల ప్రకారం.. కేటీఆర్ అతి త్వరలోనే సీఎం సీట్లో కూర్చోబోతున్నారనేది స్పష్టమవుతోంది.
Also Read: ఆ సర్వే ప్రకారం బెంగాల్ మళ్లీ దీదీదే..
తమ దగ్గర 99 శాతం కార్యక్రమాల్ని మంత్రి కేటీఆర్ చూస్తారని.. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. అందుకు తగ్గ ఉదాహరణను కూడా ఆయన ప్రస్తావించారు.‘మొన్న టీకా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌కు తనకు ఎలాంటి గ్యాప్ లేదని.. అందుకు ఆస్కారమే లేదన్న ఆయన.. పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా సమష్టి కృషితో పనిచేస్తామన్నారు. అయినా.. ఒక వ్యక్తి మీద పార్టీ ఆధారపడి లేదన్న ఆయన.. ‘ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండొచ్చు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఉంటే ఉంటదండీ.. తప్పేముంది? అని కీలక వ్యాక్యలు చేశారు.
కరోనా టీకా సందర్భంలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడాన్ని మరీ బుతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని.. తమ దగ్గర 99 శాతం కార్యకలాపాలను కేటీఆరే చూస్తారని చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఇప్పటికే యాక్టివ్ సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్న విషయం ఎవరికైనా అర్థమవుతోంది.
Also Read: ‘సాగర్’ పై గురిపెట్టిన కేసీఆర్.. సత్తా చాటేనా?
‘ఒక విజయం అనేక తప్పులను కప్పిపుచ్చుతుంది. ఒక పరాజయం అనేక రకాల తప్పులను ఎత్తిచూపుతుంది. ఏ ప్రభుత్వానికైనా పార్టీకైనా మార్పు అనేది సహజం. ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకోవాల్సి ఉంటుంది’ అని ఈటల వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలపై మరింత ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నో ఘన విజయాలు సాధించి.. సంస్థాగత బలం దండిగా ఉన్న టీఆర్ఎస్ వరుసగా రెండు ఎన్నికల ఫలితాల తర్వాత ఊడ్చేస్తాం.. తుడిచేస్తామనే భ్రమల్లో ఉండకూడదన్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేమని.. ఒకసారి ఉత్సాహంగా.. మరోసారి బాధల్లో ఉంటామని అన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్