
దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న గుజరాత్ లో ఈ వైరస్ కట్టడిలో ప్రభుత్వం కూలబడుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే 13,268 మంది వైరస్ కు గురికాగా, 802 మంది మృతి చెందారు. ముఖ్యంగా ముంబై తర్వాత అహ్మదాబాద్ నగరంలోనే ఈ వైరస్ విజృభించడం ఆందోళన కలిగిస్తున్నది.
కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రి చెరసాల కన్నా ఘోరంగా ఉందని పేర్కొంటూ గుజరాత్ హై కోర్ట్ చేసిన వాఖ్యలు కరోనా కట్టడిలో ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వెల్లడి చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 377 మంది మరణించగా, ఇది రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో 45 శాతంగా ఉంది.
కరోనా సంబంధిత సమస్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ జె.బి. పార్దివాలా, ఇలేష్‌వొరాల ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. అక్కడి ప్రస్తుత పరిస్థితిని మునిగిపోయే టైటానిక్ ఓడతో పోలుస్తూ సివిల్ ఆస్పత్రి పరిస్థితులు దారుణంగా ఉండటం బాధాకరమని పేర్కొంది.
చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రి చెరసాల కన్నా ఘోరంగా ఉండవచ్చని తెలిపింది. సివిల్ ఆస్పత్రి అదనపు చీఫ్ సెక్రటరీ పంకజ్ కుమార్, కార్యదర్శి మిలిన్ తోర్వానే, ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి జయంతి రవిని హైకోర్టు బాద్యులుగా పేర్కొంది.
ఇక్కడి పరిస్థితుల గురించి, బాధితులు, సిబ్బంది గురించి రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ ముకిమ్‌లకైనా తెలుసా అని ప్రశ్నించింది. వెంటిలేటర్లు లేకపోవడంతోనే బాధితులు మరణిస్తున్నారనే వాదనపై కోర్టు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించింది.
పైగా, ఈ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని నిలదీసింది. అహ్మదాబాద్ నగరంలోని అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న ప్రైవేట్, కార్పోరేట్ ఆస్పత్రులకు 50 శాతం పడకలను కరోనా రోగులకు కేటాయించడం తప్పనిసరి అనే నోటిఫికేషన్‌ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బహుశా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒక హై కోర్ట్ కరోనా కట్టడి విషయంలో ఇంత దారుణమైన వాఖ్యలు చేసిన్నట్లు లేదు.