తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి అమ్మకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణ చేశారు. కృష్ణా నీళ్లను ఏపీ తరలించేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అదేవిధంగా నియంత్రిత సాగు పేరుతో రైతులపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పెట్టుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని అర్వింద్ విమర్శించారు.
ఇక నిజామాబాద్ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. నిజామాబాద్ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డి జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టాలనే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు విధానం తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతులు ఏ పంటలు వేయాలో ఆంక్షలు విధించడం అందులో భాగమేనని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరుతో మొక్కజొన్న రైతులు ఇప్పటికే నిరాశకు గురయ్యారని అన్నారు.
ఎంఐఎం నేత ఓవైసీ ఓ దేశ ద్రోహి అంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ చట్ట వ్యతిరేక, దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. వలస కార్మికుల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల వరకు అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా మోదీ ఉండటం అందరి అదృష్టమని అర్వింద్ కొనియాడారు.