Arvind Kejriwal: ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నారో మహానుభావుడు. అది అక్షరాలా నిజమే. నేతలను కొందరు అమితంగా అభిమానిస్తారు. వారి పాలనకు ఫిదా అయిపోతారు. అదే కోవలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలుస్తారు. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఔరా అనిపించుకున్నారు. నేతలు ఎక్కడి నుంచో రారు జనం నుంచే వస్తారనే నానుడిని నిజం చేస్తూ ఆటో డ్రైవర్ కోరిక తీర్చి తాను కూడా ఇమేజ్ సాధించుకున్న ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.
పంజాబ్ పర్యటనలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ను ఓ ఆటో డ్రైవర్ వింత కోరిక కోరాడు. తన ఇంటికి భోజనానికి వస్తారా? అంటే దానికి ఆలోచించకుండా ఓకే అనేశారు. సాయంత్రం వెళదామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అతడి ఇంటికి భోజనానికి వెళ్లి అతడి కోరిక తీర్చాడు. దీంతో కేజ్రీవాల్ నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమైంది. దీంతో కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చిన చందంగా ఆటో డ్రైవర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రజల కోరికలు తీర్చడంలో ఉన్న మజాయే వేరని కేజ్రీవాల్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే సాధారణ ఆటో డ్రైవర్ కోరికను మన్నించి అతడి ఇంటికి భోజనం చేసేందుకు వెళ్లి సామాజిక మాధ్యమాల్లో ఎంతో క్రేజీ సంపాదించుకున్నారని చెబుతున్నారు. ప్రజల వద్దకే పాలకులు అనే నానుడిని నిజం చేస్తూ కేజ్రీవాల్ ప్రజల కోరికలు తీర్చడంలో ముందుంటారనేది నిర్వివాదాంశమే.
దీనిపై ఫొటోలు, వీడియోలు అమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా పంచుకోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. కేజ్రీవాల్ నిరాంబరతను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. సామాన్యుడిని సైతం అక్కున చేర్చుకునే సీఎం అందరివాడనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో పంజాబ్ లో కేజ్రీవాల్ తన ప్రభావం చూపెడతారనే విషయం అర్థమైపోతోంది.