Homeజాతీయ వార్తలుParliament Elections: ముఖ్యమంత్రి స్థాయిని పక్కన పెట్టి.. పార్లమెంట్ బరిలోకి..

Parliament Elections: ముఖ్యమంత్రి స్థాయిని పక్కన పెట్టి.. పార్లమెంట్ బరిలోకి..

Parliament Elections: మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కాంగ్రెస్ కూటమి.. మొత్తానికి ఈ దఫా పార్లమెంట్ ఎన్నికలు రచ్చరచ్చలాగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల నిమిషంలో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూటముల నుంచి దాదాపు 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేయబోతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ కూటమి నుంచి పోటీలో ఉన్నారు. మరో ముగ్గురు ఇండియా కూటమి నుంచి బరిలో నిలిచారు. ఈ ముఖ్యమంత్రుల జాబితాలో శివరాజ్ సింగ్ చౌహన్, సర్బానంద సోనోవాల్, జగదాంబికా పాల్ వంటి వారు ఉన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో.. అత్యంత సీనియర్ గా నేతగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నారు. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 6,122 రోజులపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్లవ్ దేవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్, హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ లాల్ వంటి వారు స్థానికంగా ఉన్న వ్యతిరేకత, స్వపక్షంలో ఉన్న అసమ్మతి కారణంగా పదవులు వదులుకున్నారు. సొంత రాష్ట్ర రాజకీయాల నుంచి బయటికి వచ్చారు. వీరు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ఫలితంగా ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. వీరు కూడా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదీష్ షెట్టర్, బసవరాజ్ బొమ్మై వంటి వారు తమ హయాంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపించలేకపోయారు. దీంతో వారు తమ పదవులను వదులుకున్నారు. వీరు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడనున్నారు.

ఇక కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రులుగా పని చేసిన దిగ్విజయ్ సింగ్, భూపేష్ సింగ్ బాఘెల్ ది కూడా అదే దుస్థితి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నబంతుకి కూడా మెజారిటీ దక్కించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ కూడా రాష్ట్రపతి పాలన వచ్చింది. రెండవసారి 2016 జూలై 13 నుంచి 16 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన పెమా ఖండు నేతృత్వంలోని 43 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరం వినిపించారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ గా మారారు. దీంతో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో పెమా ఖండు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది.

సర్బానంద సోనో వాల్, బిప్లవ్ కుమార్, దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయినప్పటికీ వారి పార్టీలు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిపాయి. రాజ్ నాథ్ సింగ్, జగదాంబికా పాల్, అర్జున్ ముండా ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటికీ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక మిగిలిన వారు ఎన్నికల్లో కొత్తగా వారి ప్రత్యర్థులతో తలపడుతున్నారు. మాజీ ప్రధాని దేవి గౌడ కుమారుడైన కుమారస్వామి ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2007లో బీజేపీ అధికారం ఇవ్వాల్సిన సమయంలో ఆయన తిరస్కరించి రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 2018 లో ఆయన నేతృత్వంలోని జేడీఎస్ మూడో పార్టీగా అవతరించిన సమయంలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేశారు. దీంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2019 జూలై నెలలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కుమారస్వామి మెజారిటీ కోల్పోయారు. ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవి నుంచి దిగిపోయిన వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చేరారు. పొత్తులో భాగంగా కుమారస్వామి పార్టీకి మూడు స్థానాలు దక్కాయి. అందులో మాండ్య పార్లమెంటు స్థానం నుంచి కుమారస్వామి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ స్థానం సిట్టింగ్ ఎంపీగా బిజెపి నేత, సినీనటి సుమలత ఉన్నారు. కుమారస్వామి వల్ల ఆమె ఈసారి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular