Pawan Kalyan: జనసేనకు లభించేవి ఆ స్థానాలేనా? పవన్ ఫుల్ క్లారిటీ

పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 50 సీట్లు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంత సీన్ లేదని 20 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

Written By: Dharma, Updated On : December 8, 2023 10:26 am
Follow us on

Pawan Kalyan: టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిందా? జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చిందా? అందుకే విశాఖలో పవన్ ఆ ప్రకటన చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చేది టిడిపి,జనసేన ప్రభుత్వమేనంటూ పవన్ తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీకే లాభమని.. మీరు చెబుతున్న సీఎం పోస్టు దక్కాలంటే ఇన్ని సీట్లు గెలిపించండి అంటూ పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 50 సీట్లు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంత సీన్ లేదని 20 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తగ్గాల్సి వచ్చిందని.. కనీసం 40 సీట్లు ఇస్తే కానీ జనసేన ఒప్పుకునే స్థితిలో లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కీలక ప్రకటన చేశారు. తాను ఎందుకు టిడిపితో పొత్తు పెట్టుకున్నది? పార్టీ శ్రేణులకు వివరించే ప్రయత్నం చేశారు. విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వైసిపికి ఛాన్స్ ఇచ్చినట్టేనని తేల్చేశారు. బలమున్న స్థానాల్లో గెలుపు పొందుతామని.. ఓట్లు చీలి వైసీపీకి లాభిస్తుందని.. అందుకే టిడిపి తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే వెళ్తామని తేల్చి చెప్పారు. సీఎం పదవి విషయంలో చంద్రబాబుతో కూర్చొని మాట్లాడతానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. భారీ మెజారిటీలే మన విజయానికి సూచికలని.. రేపటి రోజున అలా గెలిచి 30 నుంచి 35 సీట్లు గెలిపించాలని.. అప్పుడే తనదైన శైలిలో జనసేన పాలన అందిస్తుందని పవన్ తేల్చి చెప్పారు. దీంతో పొత్తులో భాగంగా జనసేనకు 30 నుంచి 35 సీట్లు టిడిపి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం ప్రారంభమైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.