
చంద్రబాబు అధికారంలో ఉండగా.. వైసీపీని ఖాళీ చేసేందుకు చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తూ.. వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. ఒకానొక సందర్భంలో ఇక వైసీపీ పని అయిపోయినట్లేనని అనుకున్నారు అంతా. కానీ.. ఐదారేండ్లు వాటన్నింటినీ ఓపికగా భరించిన జగన్ తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ఎన్నో కష్టాలు.. మరెన్నో అవమానాల మధ్య చివరికి 2019లో అధికారం చేపట్టారు. బంపర్ మెజార్టీతో ఆయన గద్దెనెక్కారు.
Also Read: రేవంత్ పీసీసీ చీఫ్ కావద్దు..: ఏపీ నుంచీ మొదలైన రాజకీయాలు
దీంతో అప్పటి నుంచి టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ పరిస్థితిని గుర్తించిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కూడా వైసీపీ చేరదీసింది. అయితే.. అది పెద్ద పొరపాటుగా ఇప్పుడు అధిష్టానం భావిస్తోంది. ఆయన చేరిక పార్టీలో రగిల్చిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. వారానికి ఒక్క సారైనా ఆ పార్టీలోని గ్రూపులు బహిరంగంగా బాహాబాహీకి దిగి అధికార పార్టీ పరువుని రచ్చకీడుస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా కేసరపల్లిలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యక్రమంలో పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని వార్తల్లోకెక్కారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పార్టీలోని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ వర్గాలు వంశీ చేరికను జీర్ణించుకోలేకపోతున్నాయి. తమ మధ్య ఏళ్ళ తరబడి వైరం ఉందని వంశీ పార్టీ మారడంతో అన్నీ మర్చిపోయి కలిసి పని చేయలేం అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు.
Also Read: ఏపీ రైతును అభినందించిన తెలంగాణ సీఎం.. విషయమెంటీ?
మరోవైపు.. పైకి చెప్పకపోయినా పార్టీ మారి తాను కూడా తప్పు చేశానని వల్లభనేని వంశీ లోలోపల బాధపడుతున్నారని ఆయన వర్గం వారే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న ప్రతిచోటా వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉండటం గమనార్హం. దానిని పార్టీ అధిష్టానం అసలు పట్టించుకోకపోవడం కొసమెరుపు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్