Homeఆంధ్రప్రదేశ్‌AP Capital Issue : ఇదేంది మరీ ఇంత పేర్లు పిచ్చా? అబ్ధుల్ కలాం పేరు...

AP Capital Issue : ఇదేంది మరీ ఇంత పేర్లు పిచ్చా? అబ్ధుల్ కలాం పేరు చెరిపేస్తారా?

AP Capital Issue : త్వరలో విశాఖలో కాపురం పెడతానని సీఎం జగన్ ప్రకటించారు. కానీ విశాఖ నగరవాసులు మాత్రం మాకొద్దు బాబోయ్.. మా మానాన మమ్మల్ని విడిచిపెట్టండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన నాటి నుంచి చుక్కలు చూపించారు. ఇప్పటివరకూ చూపింది రిహార్సల్సే.. సెప్టెంబరు నుంచి అసలు సిసలు సినిమా ఉంటుందని జగన్ చెప్పకనే చెప్పారు. అయితే ఇంకా విశాఖలో అడుగుపెట్టక ముందేు చారిత్రాత్మక కట్టడాలను చెరిపేశారు. మరికొన్నింటి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇప్పుడు కొన్ని నిర్మాణాల పేర్లు చెరిపేసే పనిలో పడ్డారు. దశాబ్దాలుగా ముచ్చపడి చారిత్రక కట్టడాలకు, పర్యాటక ప్రాంతాలకు పెట్టిన మహనీయుల పేర్లను తొలగించి తన తండ్రి పేరు మీద మార్చుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యం అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ పేరునుతొలగించారు…
మొన్నటికి మొన్న ఎన్టీఆర్ పేరును తొలగించారు. ఆయన పేరిట ఉన్న హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ పేరు మీద మార్చేశారు. టీడీపీతో పాటు విపక్షాలు ఎన్నిరకాల గోల చేసిన డోంట్ కేర్ అన్నట్టు పట్టించుకోలేదు. పైగా ఇన్నాళ్లకు కరెక్ట్ నాయకుడి పేరు పెట్టారని మంత్రులు నిండు శాసనసభలో సమర్థించుకున్నారు. తాజాగా విశాఖలో బీచ్ వ్యూ పాయింట్ కు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. అంతకు ముందు ఈ వ్యూ పాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు ఉండేది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రగులుతోంది. ఈ పేర్లు మార్పు సంస్కృతి ఏమిటని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

సుందరీకరణ పేరుతో..
విశాఖలో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి సాగర నగరానికి ల్యాండ్ మార్కుగా నిలుస్తున్నాయి. సీతంకొండ సమీపంలో అబ్ధుల్ కలాం పేరిట ఒక వ్యూ పాయింట్ ఏర్పాటుచేశారు. వైజాగ్ వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ దీనిని ఏర్పాటుచేసింది. దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దింది. ఇటీవల జీ20 సదస్సు నిర్వహణలో భాగంగా మరింత అభివృద్ధి చేశారు. అయితే పనిలో పనిగా అబ్ధుల్ కలాం పేరును తీసి వైఎస్సార్ పేరు పెట్టారు. దివంగత వైఎస్సార్ నాయకుడే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేష సేవలందించిన వారే. అంతమాత్రాన అన్ని నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాలకు ఆయన పేరు పెట్టాలని చూడడం మాత్రం సహేతుకంగా లేదు. దీనిపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజాసంఘాలు సైతం మండిపడుతున్నాయి. పోరాటానికి సిద్ధపడుతున్నాయి.

వారిది అరణ్య రోదనే..
వ్యూపాయింట్ ను ఏర్పాటుచేసిన వైజాగ్ వలంటీర్స్ ప్రతినిధులకు ఎటువంటి సంకేతం అందిందో తెలియదు కానీ.. దాని పరిరక్షణకు కొద్దినెలల కిందటే రంగంలోకి దిగారు.సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వ్యూపాయింట్ కు అబ్ధుల్ కలాం పేరును శాశ్వతంగా ఉండాలని విన్నవిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఆన్ లైన్ క్యాంపు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కానీ వీరి విన్నపాలు, ప్రయత్నాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దివంగత అబ్ధుల్ కలాం పేరు తొలగింపు అనేది ఇప్పుడే కాదు. గతంలో కూడా జరిగింది. ఆయన పేరిట ఉన్న ప్రతిభా పురస్కారాలను వైఎస్సార్ పేరిట మార్చారు. దీనిపై దుమారం జరగడంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారని.. ఆయనకు తెలియకుండా తప్పు జరిగిందని చెప్పి…తిరిగి అబ్ధుల్ కలాం పేరును పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ విషయంలో ఎటువంటి చర్యలు చేపడతారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version