
YS Sunita Political Entry : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? కడప ఎంపీగా పోటీచేస్తారా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమెను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వైఎస్ సునీత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తండ్రి హత్య కేసులో గట్టి పోరాటం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆమెపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మీడియాలో సైతం రకరకాలుగా ప్రచారం సాగుతోంది. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్న మహిళగా ఎల్లో మీడియా ఆకాశాన్నెత్తేస్తోంది. వైసీపీ అనుకూల మీడియా మాత్రం వివేకా హత్య పాపం కుమార్తె సునీత, అల్లుడి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పై నెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే వివేకా హత్య ఘటన మాత్రం ముమ్మాటికీ వైసీపీకి మైనస్సే. అది ఎంత అంటే కడపలో వైఎస్ కుటుంబ రాజకీయ వృక్షం పడిపోయేటంతగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
తండ్రి మరణంతో సానుభూతి..
తండ్రి హత్య కేసులో పోరాడుతున్న సునీత అంటే కడప ప్రజలకు ఒక రకమైన సానుభూతి వ్యక్తమవుతోంది. ఆ ఫీలింగ్ పెరిగితే మాత్రం వైసీపీకి, ముఖ్యంగా జగన్ కు అంతులేని నష్టం జరగవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఏర్పడినప్పుడు నాయకులుగా గుర్తించబడతారు. ఈ విషయంలో జగన్ కంటే ఉదాహరణ మరొకరు ఉండరు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ జగన్ ఒక సాధరణ ఎంపీ మాత్రమే. కానీ తండ్రి మరణంతో అంతులేని సెంటిమెంట్ ను సొంతం చేసుకున్నారు. ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చింది. అటు పార్టీ శ్రేణులు సైతం అండగా నిలబడ్డారు. అనతికాలంలోనే సొంత పార్టీ పెట్టి విజయం సాధించగలిగారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. ఇప్పుడు సునీత విషయంలో అదే జరిగే చాన్స్ ఉంది. ఎందుకంటే కడప లో ఉన్నది వైఎస్ కుటుంబ అభిమానులు కాబట్టి.

జగన్ ఒంటరి..
ఇప్పుడు సీఎం జగన్ రెండు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకటి వివేకానందరెడ్డి హత్యకేసును పక్కదారి పట్టించడం, విచారణలో జాప్యం, నిందితులకు వకల్తా పుచ్చడంతో జగన్ చరిత్ర మసకబారింది. రెండోది కుటుంబ అభిమానులను దూరం చేసుకోవడంతో మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. మరోవైపు ఇన్నాళ్లూ అటు భాస్కరరెడ్డి, ఇటు వివేకానందరెడ్డి రక్షణ కవచంగా నిలుస్తున్నారు. ఒకరు హత్యకు గురికాగా.. మరొకరు హత్యనిందితుడిగా తేలారు. దీంతో ఇరువర్గాలూ దూరమయ్యాయి. అటు ప్రజా వ్యతిరేక పెల్లుబికుతుండగా.. ఇటు పొలిటికల్ లీడ్ చేసేవారు కరువయ్యారు. దీంతో జగన్ ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారు.
టీడీపీకి గోల్డెన్ చాన్స్
ఇటువంటి సమయంలో సునీత పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం వైఎస్ కుటుంబ అభిమానులతో పాటు కడప జిల్లా ప్రజల అభిమానం చూరగొనే అవకాశం ఉంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ గోల్డెన్ చాన్స్ విడిచిపెట్టడం లేదు.టీడీపీ ఆవిర్భావం తరువాత టీడీపీ ఈ ఎంపీ స్థానాన్ని దక్కించుకోలేదు. అందుకే చంద్రబాబు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వివేకా హత్యకేసును ఎదుర్కొనే క్రమంలో సునీతకు తెర వెనుక సాయమందిస్తోంది చంద్రబాబు అన్నది బహిరంగ రహస్యమే. ఈ చనువుతోనే ఇప్పుడు సునీతకు పోటీచేయించడానికి ఒప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. కేసులో ఇంత లోతుగా వెళ్లిన తరువాత పొలిటికల్ సపోర్టు లేనిదే భవిష్యత్ లో ముప్పు తప్పదని సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సైతం భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఒక వేళ సునీతే కానీ బరిలో దిగితే కడప జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారే అవకాశాలున్నాయి.