AP Three Capitals: అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్ర 2.0 చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. మరోవైపు మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని వైసీపీ మంత్రులు, కీలక నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం అమరావతి వ్యతిరేక,అనుకూల పోస్టులు, కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం తాము ఏకైక రాజధానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేస్తోంది. దీంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. సరిగ్గా పాదయాత్ర సమయంలో ప్రకటన చేయడంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం నానా రభస చేసింది. కనీసం యాత్ర చేపట్టే వారికి బస లేకుండా చేసింది. లాఠీచార్జీకి కూడా దిగింది. ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. కానీ బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకైక రాజధానికే నిధులు అన్న ప్రకటన చేసిన విషయాన్ని అందరూ గుర్తుచేస్తున్నారు. తద్వారా పాదయాత్రకు బీజేపీ మద్దతు ఉందన్న సంకేతాలు పంపింది. మరోవైపు పాదయాత్ర సజావుగా జరిపించే బాధ్యతను న్యాయస్థానం పోలీస్ శాఖకు అప్పగించింది. స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

సర్కారు ఉక్కిరిబిక్కిరి..
అయితే ఈ మొత్తం వ్యవహారంలో జగన్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. అమరావతి రాజధానికి మద్దతు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతోంది. దీనికి విరుగుడుగా ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ పార్టీ వారికే తెలియదు. అమాత్యులు, అధికారులతో కనీస ఆలోచన చేయరు. సంప్రదించరు కూడా. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వైసీపీ శ్రేణులు మాత్రం ఆహా ఓహో అంటాయి. కొందరైతే డైనమిక్ సీఎం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయమే ఒక డైనమిక్. మూడు రాజధానులతో ఏపీ అమెరికా అవుతుందని జగన్ భావిస్తున్నారుట. అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.కానీ పార్టీ శ్రేణులు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు.. మూడు రాజధానులను రిఫరెండంగా తీసుకొని వెళితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

విపక్షం నుంచి సవాల్...
ఏపీ సీఎం జగన్ కు ఒక అలవాటు ఉంది. సొంత పార్టీ నేతలు చెబితే వినరు. పార్టీలో సీనియర్లను గౌరవించరు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవునంటే కాదంటారు.. కాదంటే అవునంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సరికొత్త సవాల్ వచ్చి పడుతోంది. దమ్ముంటే మూడు రాజధానులపై ఎన్నికలకు వెళదామని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారు. విపక్షం సవాల్ ను తేలిక తీసుకుంటున్నారు. ముందుగా మూడు ప్రాంతాలపై చిచ్చు రేపాలని నిర్ణయించుకున్నారు. అందుకే తమ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి పనిచెప్పారు. మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త విభిన్నంగా ఉంటుంది కాబట్టి… తనకు తిరుగులేని ప్రజాదరణ ఉందని భావిస్తున్నారు కాబట్టి.. తనకిష్టమైన మూడు రాజధానులపై రిఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.