మొన్నటి వరదలు ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఇబ్బందుల పాలుజేశాయి. మహానగరంగా.. భాగ్యనగరంగా చెప్పుకునే హైదరాబాద్ ఇప్పటికీ నీళ్లలోనే ఉంది. దీనికితోడు పుండు మీద కారం చల్లినట్లుగా నిన్న మరోసారి వర్షం కురియడంతో మరోసారి నీట మునిగింది. మరోవైపు హైదరాబాద్‌లో పరామర్శలకు వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ పాలకులను ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు.
Also Read: దుబ్బాకలో హరీశ్ సీక్రెట్ టాస్క్?
అయితే.. వారందరిదీ ఆకలి కోపమనే చెప్పాలి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే రిలీఫ్ కిట్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. నిత్యావసరాలతోపాటు మూడు దుప్పట్లో కిట్‌లో ఉంటాయి. దీని విలువ రూ.2,800 వరకు ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. వెంటనే పంపిణీ చర్యలు కూడా ప్రారంభించారు. దీంతోపాటు ఆస్తి నష్టం జరిగిన వారిని ఆదుకునేలా కార్యాచరణ కూడా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. అటు ఏపీలోనే వరదలు బీభత్సమే సృష్టించాయి. పెద్ద ఎత్తున నష్టం కూడా వాటిల్లింది. పంట సాయం సంగతేమో కానీ.. ఊళ్లు నీట మునిగాయి. దీంతో పెద్ద ఎత్తున జనాల్ని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. ఇళ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద పరిశీలన చేయలేదు. కానీ.. తక్షణ సాయంగా ఐదు జిల్లాలకు రూ.12 కోట్లు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. ఇది అందరికీ కాదు.. కేవలం .. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికే. ఇక ఎలాంటి నిత్యావసర వస్తువుల పంపిణీ ఇతర సాయం ప్రకటనలు చేయలేదు.
Also Read: ప్రజల్లో కరోనా భయం పోయిందా..?
ఏపీలోని కోస్తా తీరానికి ఎప్పుడూ తుపానుల గండమే. అతివృష్టి కూడా ఎక్కువే. అందుకే ప్రజలు ఎక్కువగా వరదలతో నష్టపోతూ ఉంటారు. కానీ ప్రభుత్వాల సాయం మాత్రం ప్రతిసారీ అంతంతే. 2019లో వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన నష్టపరిహాం 2020లో వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన వరదలతో ప్రకటించిన సాయం ఎప్పుడు పంపిణీ చేస్తారో అది పాలకులకే తెలియాలి. తెలంగాణలో తాత్కాలికంగా అయినా నిత్యావసర వస్తువుల కిట్ ఇచ్చి.. దుప్పట్లు ఇచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం 500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రకటించిన రూ.12 కోట్ల సాయం ఎప్పుడు అందుతుందో ఎవరికీ తెలియకుండా ఉంది.