ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. జగన్ సర్కార్ ఐదేళ్ల పదవీ కాలంలో పావు భాగం ఇప్పటికే పూర్తైంది. అయితే ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు చిత్రవిచిత్రంగా జరుగుతున్నాయని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎస్, డీజీపీ స్థాయి అధికారులకు సైతం తెలియకుండానే పనులు జరుగుతున్నాయని, ఫైళ్లు కదులుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలకమైన శాఖలు కొందరి గుప్పిట్లోనే చిక్కుకుపోయాయని… మిగిలిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారని సమాచారం.
మరోవైపు జగన్ సర్కార్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జగన్ అనుకూల పత్రికకు ప్రభుత్వం నుంచి ఎక్కువగా యాడ్స్ వెళ్లినట్లు నిరూపితమైంది. ఇలాంటి విషయాల్లో నమోదైన కేసుల్లో అధికారులకు ఇబ్బందులు తప్పవు. పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అవతవకలు జరిగితే ఇబ్బందులు పడాల్సింది అధికారులే. అందువల్లే అవకాశం ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.