Pawan Kalyan: విశాఖలో ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో పవన్ వారాహి మూడో విడత యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం జగదాంబ జంక్షన్ నుంచి పవన్ యాత్రను మొదలుపెట్టనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసులు ఆంక్షలు విధించడం విశేషం. పవన్ తన యాత్రలో విధిగా ఆంక్షలు పాటించాల్సిందేనని పోలీసులు తేల్చి చెబుతున్నారు. దీంతో గత అనుభవాల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన విశాఖలో వ్యక్తం అవుతోంది.
గతంలో పవన్ విశాఖ పర్యటనలో నెలకొన్న పరిణామాలు సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో వైసీపీ,జనసేనల మధ్య నినాదాల పర్వం కొనసాగింది.అప్పట్లో పవన్ జనవాణి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.రెండు రోజులు పాటు పవన్ విశాఖ లో హోటల్ కి పరిమితమయ్యారు.ఎటువంటి కార్యక్రమం నిర్వహించకుండానే విజయవాడ వెనుతిరి గారు. అప్పట్లో ఈ ఘటన ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టించింది. ఇప్పుడు మరోసారి పోలీసులు సైతం అవే ఆంక్షలు పెడుతుండడంతో చర్చనీయాంశంగా మారింది.
పవన్ నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొనున్నారు.అక్కడ నుంచి హోటల్కు చేరి బస చేయనున్నారు. సాయంత్రం వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా పోలీసులకు అందజేశారు. అయితే పోలీసులు మాత్రం జనసేనాని టూర్లో పలు ఆంక్షలు విధించారు.కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో వారాహి మూడో విడత యాత్ర ప్రారంభానికి ముందే సెగలు పుట్టిస్తుంది.
ఎయిర్ పోర్ట్ నుంచి పోర్టు రోడ్డు లోనే పవన్ కళ్యాణ్ నగరంలోకి రావాలని పోలీసులు సూచించారు. మధ్యలో రోడ్డు షోలు,కారులో నుంచి బయటకు వచ్చి అభిమానులకు చేతులు ఊపడం వంటివి వద్దని ఆదేశించారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. అయితే ఇవి అమలు సాధ్యమా అన్నది ప్రశ్న. పవన్ అంటేనే అభిమానుల గోల. భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తారు. అటువంటిది పవన్ టూర్ కి ఆంక్షలు విధించడం తగునా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.పోలీసుల తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.ఇటువంటి తరుణంలో పవన్ మూడో విడత వారాహి యాత్రపై ఉత్కంఠ నెలకొంది.