
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆయుర్వేద కరోనా నివారణ మందుపై తుది నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒకటి తేల్చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. అన్ని వైపుల నుంచి ఆయుర్వేద మందుపై ఒత్తిడి వస్తున్న దృష్ట్యా దీనిపై నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
తాజాగా కోవిడ్ కట్టడి చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య ఔషధంపైనా సీఎం జగన్ చర్చించినట్టు రాములు తెలిపారు. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాములు తెలిపారు.
ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీసీఆర్ఎఎస్ నివేదిక రేపు వస్తుందని.. నివేదికతోపాటు హైకోర్టు తీర్పు రాగానే ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటారని రాములు తెలిపారు.