AP Results In Assam: అస్సాంలోనూ ఏపీ ఫలితాలే
* 10 లో 56.49 శాతం మందే పాస్
*అంతకుముందు ఏడాది రిజల్ట్ 93 శాతం
…
మొన్న పొరుగునున్న ఏపీలో టెన్త్ ఫలితాలు ఏ స్థాయిలో చర్చకు దారి తీశాయో చూశాం కదా. ఇప్పుడు ఆ రాష్ట్రం కంటే దిగువన ఉన్న అస్సాంలో కూడా ఆ స్థాయి ఫలితాలే వచ్చాయి. మొన్న ఏడో తారీఖు టెన్త్ రిజల్ట్ ప్రకటించారు. ఫలితాలన్నీ నాసిరకంగానే వచ్చాయి. జస్ట్ 56.49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. అంతకు ముందు ఏడాది ఈ రిజల్ట్ 93 శాతంగా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు సగానికి కొంచెం అటు ఇటు గా రిజల్ట్ తగ్గింది. అదే ప్రభుత్వం, అవే స్కూళ్లు, అదే విద్యార్థులు, ఉపాధ్యాయులు. మరి తేడా ఎక్కడ కొట్టింది?

…
కరోనా చాలా గుణ పాఠాలు నేర్పింది
..
కరోనా ఒక్క చైనాకే కాదు ప్రపంచం మొత్తానికి గుణపాఠాలు నేర్పింది. ఆ వ్యాధి పుట్టిన చైనాలో ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మిగతా ప్రాంతాల్లో ఆ వ్యాధి తగ్గినా ఆ ప్రభావం అన్ని రంగాల మీద ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక గత రెండేళ్లుగా కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా భ్రష్టు పట్టి పోయింది. పరస్పర నిందారోపణలు తోనే కాలం వెళ్లబుచ్చిన నాయకులు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలం అయ్యారు. ఫలితంగానే టెన్త్ లో ఈ స్థాయిలో రిజల్ట్ వచ్చింది. 25 స్కూళ్ళల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదంటే పరిస్థితి తీవ్రత ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
…
బళ్ళు తెరుచుకుంటే కదా
…
కోవిడ్ కారణంగా 2020లో 8 నెలలు, 2021లో ఏడు నెలలు పాఠశాలలు తెరుచుకోలేదు. ఎలాగూ కర్ఫ్యూ ఉండడంతో చదువు చెప్పే ఉపాధ్యాయులు బడుల వంక చూడలేదు. ఉపాధి లేక ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడు పూటల భోజనం పెట్టేందుకే కష్టమైంది. ఇక ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ఫోన్లు కొనేంత ఆర్థిక స్థోమత వారికి ఎక్కడిది? కనీసం పుస్తకాలు సమకూర్చే స్థాయి కూడా లేకపోవడంతో చదువులని పక్కన పెట్టేశారు. బతికి ఉంటే చాలు అనుకుని వారి పిల్లల్ని తమతోపాటు ఉంచుకున్నారు. కొంతమంది ఇదే తేయాకు తోటల్లో పనికి కుదిర్చారు. క్షేత్రస్థాయిలో ఇంతటి దారుణం జరుగుతుంటే ప్రభుత్వం అటువైపుగా చూడలేదు. పేద విద్యార్థులకు చదువుకునే సౌలభ్యాన్ని అస్సలు కలిపించలేదు. అందుకే టెన్త్ రిజల్ట్ ఈ స్థాయిలో వచ్చింది.
…
దారుణ ఫలితాలు
…
అస్సాం రాష్ట్రంలో మొత్తం 35 జిల్లాలు ఉన్నాయి. వీటిలో పది జిల్లాలు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో పది పేద జిల్లాలోనే దారుణంగా వచ్చాయి. ఎగువ అస్సాంలోని బక్సా జిల్లాలో 82 శాతం వరకు రిజల్ట్ వచ్చింది. అదే దిగువ అసోంలోని శివసాగర్, ఘోలాఘట్ జిల్లాల్లో 25 శాతం మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఈ జిల్లాలన్నీ కూడా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నవే. ఈ ప్రాంతాల్లో పర్వతశ్రేణులు అధికంగా ఉండడంతో కాఫీ, తేయాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి వారికి ఆ తోటలో పని చేస్తేనే నోట్లోకి ఐదు వేళ్లు వెళ్తాయి. అలాంటి సమయంలో అసలు కరోనా ఉత్పాతాన్ని వారు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా అందుకు తగ్గట్టుగా సన్నద్ధత వారి దగ్గర లేదు. తినటానికి తిండి లేనప్పుడు ఇక పిల్లల కోసం స్మార్ట్ఫోన్లు, పుస్తకాలు ఎక్కడినుంచి తెగలరు? పోనీ సమస్య ఈ స్థాయిలో ఉన్నప్పుడు కనీసం విద్యార్థుల కోసం బ్రాడ్బ్యాండ్ వంటి సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు 10 లో నూటికి నూరు శాతం రిజల్ట్ ను ఎలా ఆశించగలం? ఇవాల్టికి ప్రభుత్వాలు విద్యారంగానికి జిడిపిలో చేస్తున్న ఖర్చు మూడు శాతానికి మించడం లేదు. ఎప్పటికీ ఓట్లు దండుకునే పథకాలు ప్రకటించడం, ప్రజలను సోమరిగా చేయడం తప్ప ప్రభుత్వాలకు వేరే చేతకావడం లేదు. నిధుల సమీకరణకు సమస్య తలెత్తినప్పుడు ప్రభుత్వ భూములు అడ్డగోలుగా అమ్మేస్తున్నారు
…
తెలంగాణలో ఏం జరుగుతోంది

…
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్ రిజల్ట్ లో జరిగిన అవకతవకల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పట్లో ఇదో సంచలనం. ఊరు పేరు లేని సంస్థకు మార్కులు రూపొందించే పని అప్పగించడంతో ఈ సమస్య తలెత్తింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆ సంస్థకు కాంట్రాక్టు రద్దు చేసింది. ఇక గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిగా తరగతులు జరగకపోవడంతో వారిలో అభ్యసన సామర్థ్యం సన్నగిల్లింది. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విద్యారంగంలో తెలంగాణ దరిదాపు అట్టడుగు నుంచి ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటికీ పెచ్చులూడే స్కూళ్లు, కంపుకొట్టే మూత్రశాలలు, మరుగుదొడ్లు. వంట షెడ్డులు లేక ఆరుబయటే మధ్యాహ్న భోజనం వండుతున్న ఆనవాళ్లు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎప్పుడో గాడి తప్పింది. గురుకులాలు ఏర్పాటు చేశామని జబ్బలు చరుచుకుంటున్నా.. నేటికీ సొంత భవనాలు లేకుండా అద్దె వాటిల్లోనే కొనసాగిస్తున్నారు. ఒక్క భవనంలో 500 నుంచి 700 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక అక్కడి పారిశుద్ధ్య వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజాంబాద్ రూరల్ ప్రాంతం, ఖమ్మంలోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అంటే తెలియవు. అసలు వారికి స్మార్ట్ఫోన్ అంటే కూడా తెలియదు. ఇలాంటి దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం భావిభారత విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందజేయకపోవడంతో వారు రెండేళ్లు చదువులకు దూరంగా ఉన్నారు. పైగా వారి తల్లిదండ్రులది రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం కావడంతో ఉన్న ఊరిలో ఉపాధి లేక కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఆ విద్యార్థులకు చదువు అందని ద్రాక్షే అయింది. తల్లిదండ్రులతో పాటు వారు పనులు చేస్తుండడంతో విద్యకు దూరం అవుతున్నారు. కరోనా ఎన్నో పాఠాలు నేర్పిన నేపథ్యంలో పూర్తి స్థాయి సన్నద్ధత వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. స్కూళ్ళకు మరమ్మతులు చేయడం లేదు. ఒకవేళ చేసినా అవి పైపై రంగులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే విద్యారంగంలో ధనిక, పేదరిక అంతరాయం అంతకంతకూ పెరగడం తథ్యం.