Junior NTR- TDP: తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. మునిగిపోయే నావ వలే అయిపోయింది. ఎవరో ఒకరు దాన్ని మునగకుండా కాపాడాల్సిన సమయం వచ్చింది. దానికి సమర్థుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వాదన కొద్ది కాలంగా వినిపిస్తోంది. అయితే దీనికి చంద్రబాబు మాత్రం ఓకే అనడం లేదు. ఈ క్రమంలో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడనుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనకు రెండొంతల మార్కులు పడ్డాయి. ఆయన నటనకు అందరు ఫిదా అయిపోతున్నారు. ఈ సమయంలో ఆయన టీడీపీ కోసం పనిచేస్తే కచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమే అనే సంకేతాలు వస్తున్నాయి. కానీ దీనిపై అధినేత చంద్రబాబు మాత్రం సానుకూలత వ్యక్తం చేయడం లేదు.
2019 ఎన్నికల్లోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి ప్రచారం చేయాలని కొందరు వాదించినా చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు. ఫలితం అధికారానికి దూరం అయ్యారు. దీంతో గతం తాలూకు అనుభవాల దృష్ట్యా ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకుని పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం గ్రహించుకోవాలి. లేదంటే పార్టీ మళ్లీ అధికారం కోల్పోతే ఇక తెలంగాణ పరిస్థితి పునరావృతం కానుందనే బెంగ అందరిలో పట్టుకుంది.
Also Read: Yadadri Temple: నేడే యాదాద్రి ప్రారంభం.. తొలి దర్శనం కేసీఆర్ కే..
ఇక నారా లోకేష్ నాయకత్వంపై పార్టీలోని పెద్దలే పెదవి విరుస్తున్నారు. ఆయనకు అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే సత్తా ఆయనకు లేదని ఏనాడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ హిందూపురం బరిలో ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా జత కలిస్తే ఇద్దరు పార్టీని విజయతీరాలకు చేర్చడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ముందు నుంచే కార్యాచరణ ప్రణాళిక అవసరం. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ కావడంతో ముందస్తు వ్యూహాలు ఉండాలి. అధికార పార్టీని ఓడించాలంటే భారీగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం అహర్నిశలు శ్రమించాలి. తగిన నాయకుడు ఉండాలి. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టేలా మన ప్రచారం తయారు కావాలి. అందు కోసం పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేయాల్సిన అవసరం గుర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఉన్న ఒకే ఒక్క అవకాశం జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముందుకు వెళితే విజయం దక్కడం ఖాయం.
లేదంటే టీడీపీ మరో ఐదేళ్లు అధికారం కోసం ఆగాల్సిందే. వైసీపీ దెబ్బకు కుదేలు కావాల్సిందే. అధికార పార్టీ కావడంతో దానికి ఉన్న బలం వేరే. అధికారం కోల్పోయిన పార్టీ కావడంతో టీడీపీ బలహీనత వేరే. అందుకే చంద్రబాబు స్పందించి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవక తప్పదని తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే విజయం సాధించడం కచ్చితమనే వాదన అందరిలోనూ వస్తోంది. ఇక చంద్రబాబుకే తెలుసు ఏం నిర్ణయం తీసుకుంటారో? టీడీపీని ఏం చేస్తారో? వేచి చూడాల్సిందే.
Also Read: Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
Recommended Video: