YCP Plenary 2022: వైసీపీలో అసలేం జరుగుతోంది? అధికార పార్టీలో ఇటీవల జరుగుతన్న పరిణామాలు శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ, చిత్తూరు నుంచి అనంతపురం వరకూ పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కింది స్థాయి నాయకుల మధ్య తగాదాలు అనుకుంటే పొరబడినట్టే. సీఎం కు అత్యంత నమ్మకస్థులు , సమీప బంధువులు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారు కూడా వీధి పోరాటానికి దిగుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య పొసగడం లేదు. తనపై కుట్ర చేస్తున్నారని బాలినేని బహిరంగ ఆరోపణలకు దిగారు. సీఎం విదేశీ పర్యటన నుంచి రాగానే అమీతుమీ తేల్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజా మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ పరోక్షంగా ఆనం రామనారాయణ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనం ఎక్కువవుతోందని కూడా చెబుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న నెల్లూరు వైసీపీలో విభేదాలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నిర్వీర్యం చేసేలా ఉన్నాయి. నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.
కొత్త సమస్య తెచ్చిన కొడాలి..
వైసీపీ అధిష్టానం మాత్రం గతం మాదిరిగా కట్టడి చేసే ప్రయత్నం చేయలేకపోతోంది. కఠినంగా వ్యవహరించలేకపోతోంది. అది ఏ పరిణామాలకు దారితీస్తుందోనని భయపడుతోంది. అందుకే కీలక నేతలకు సైతం ఇతర నియోజకవర్గాల విషయంలో కలుగజేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం విషయంలో మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ ని విభేదించి వైసీపీ గూటికి వచ్చిన వల్లభనేని వంశీకి పాత కాపులైన దుట్టా రామచంద్రరెడ్డి, యార్గగడ్డ వర్గాలతో పొసగడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మాదంటే మాది అని ప్రచారం చేసుకుంటున్నారు. పంచాయితీ అధిష్టానం వద్దకు వెళ్లినా తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టారు.
Also Read: Vangaveeti Radha Krishna: జనసేన గూటికి వంగవీటి రాధాక్రిష్ణ.. ముహూర్తం ఫిక్స్..
ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట జరిగిన ప్లీనరీలో కొడాలి నాని ఒక అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో తన మిత్రుడు వల్లభనేని వంశీకే గన్నవరం టిక్కెట్ లభిస్తుందని బాంబు పేల్చారు. ఈ విషయం సీఎం జగనే స్వయంగా తనతో చెప్పారని కూడా సమావేశంలో ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై దుట్టా, యార్లగడ్డ వర్గీయులు గరంగరంగా ఉన్నారు. అభ్యర్థి పేరు ప్రకటించడానికి నాని ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. స్నేహితులైతే మీరు మీరు చూసుకోండి కానీ.. సీఎం చెప్పినట్టు ప్రకటించడం ఏమిటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన యార్లగడ్డ వెంకటరావు కేవలం 800 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అంటే వైసీపీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ వంశీకే కానీ ఖరారు చేసినట్టయితే తాడోపేడో తేల్చుకుంటామని సవాల్ విసురుతున్నారు. కొడాలి నాని తీరుపై అధిష్టాన పెద్దలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. క్యాండిడేట్ పేరు మేమే ఎక్కడా ప్రస్తావించడం లేదని.. అదంతా అధిష్టానం చూసుకుంటుందని.. కానీ నాని కేవలం స్నేహితుడి గురించే ప్రకటన చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కుమ్ములాటలు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ లోలోపల ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. రోడ్డుకెక్కుతున్నారు. వైసీపీలో ఉక్కపోతకు గురవుతున్నామని.. అదును చూసి బయటకు వెళ్లిపోతామని సంకేతాలు పంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అక్కడి మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు మీ ప్లీనరీకో దండమంటూ సమావేశం నుంచి తనవర్గంతో నిష్క్రమించారు.
మరో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి క్రుపారాణికి పొమ్మనలేక పొగ పెట్టారు. సీఎం పర్యటనలో దారుణ అవమానం చేశారు. సీఎం ను స్వాగతం పలికేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు మైండ్ సెట్ మార్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీనిపై అధిష్టానానికి కూడా స్పష్టమైన సమాచారం ఉండడంతో కీలక నాయకుడు, మంత్రి బొత్స స్పందించారు. మీ మనసులో మరో ఆలోచన మొదలైంది అన్నట్టు కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే మనలో ఉన్న లోటుపాట్లు గురించి మాట్లాడుకుందామని కూడా చెప్పుకొచ్చారు. అంటే అధిష్టానానికి సైతం స్పష్టమైన సమాచరం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ అధికార వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ కు మాత్రం మింగుడుపడడం లేదు. ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.