AP Political Parties: ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయినా ఏపీలో రాజకీయ పక్షాలు సందడి ప్రారంభమైంది. అన్ని పార్టీలు ప్రజల బాట పడుతున్నాయి. రెండేళ్ల ముందు నుంచే ఓటర్ల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయి. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇప్పటివరకూ తాము చేసిన సంక్షేమం, అభివ్రద్ధిని చెప్పుకునేందుకు వైసీపీ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి మద్దతు పొందేందుకు టీడీపీ, జనసేనలు జనం బాట పట్టాయి. పనిలో పనిగా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులను ఆరాతీసి ఒక నిర్ణయానికి వస్తున్నాయి. ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి.. ఈ రెండేళ్లు వారు ప్రజల్లో ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాలతో దూకుడును పెంచుతున్నాయి. ఒక వైపు పొత్తులకు చేయిచాస్తూనే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ద్రుష్టిసారించాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుండడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

అధికార పక్షం దూకుడు..
ఇప్పటికే వైసీపీ జనం బాట పట్టింది. మూడేళ్లుగా తాము చేసిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు తెలియజెప్పడమే కాకుండా.. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు అధికార పక్షం ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించింది. తొలి విడతగా ఇప్పటికే వైసీపీ ప్రజా ప్రతినిధులు పల్లెలు, పట్టణాలు తిరుగుతున్నారు. కానీ ఎక్కడికక్కడే ప్రజల నుంచి నిలదీతలు, నిరసనలు వ్యక్తమవుతుండడంతో పునరాలోచనలో పడ్డారు. అయినా కార్యక్రమం విషయంలో జగన్ వెనక్కి తగ్గడం లేదు. మరో ఆరు నెలల పాటు కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎలా ముందుకెళ్లాలో తెలియజెప్పేందుకు రాష్ట్రస్థాయిలో వర్క్ షాపు ను నిర్వహించారు. నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావమే. పార్టీ ఎమ్మెల్యేలంతా ఎనిమిది నెలల పాటు గడప గడపకూ వెళ్లనున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం ఉంది కాబట్టే.. ఆ గడువు పెట్టారని భావిస్తున్నారు. కారణం ఏదైనా చేస్తోంది ఎన్నికల ప్రచారమే. ప్రతి ఇంటికి ఇంత మొత్తం ఇచ్చాం కాబట్టి ఓటు వేయాలని గడప గడపకూ వెళ్లి వైసీపీ ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. అదే సమయంలో జిల్లాల పర్యటనకు వెళతానని చెబుతున్న జగన్ ఆ పని చేయడం లేదు. మరోవైపు సామాజిక బస్సు యాత్ర పేరిట రాష్ట్ర వ్యప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు పర్యటించారు
టీడీపీలో ఊపు..

ప్రభుత్వ వైఫల్యాలు, చార్జీల పెంపు, పన్నుల పెంపు తదితర వాటిపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యక్రమాలను రూపొందిస్తోంది. అందులో భాగంగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’కు విపరీతమైన స్పందన రావడంతో అదే ఊపును కొనసాగించాలని నాయకత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, టీడీపీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయించింది.
ఎన్నికలయ్యే వరకూ యాత్రలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక పూర్తిగా ప్రజల్లో నే ఉండాలని నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 15వ తేదీ నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్టోబరు లో లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన లను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు.
దసరా నుంచి పవన్..

Also Read: Pawan Kalyan Politics: షాకింగ్ : సినిమాలకు పవన్ స్టాప్.. ఎన్నికల వరకూ ప్రజల్లోనే
మరోవైపు పవన్ కూడా ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు నుంచి రాష్ట్ర పర్యటనలకు సిద్ధపడుతున్నారు. అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తిచేయాలని భావిస్తున్నారు. తొలుత పవన్ పాదయాత్ర చేస్తారన్న టాక్ నడిచింది. కానీ పాదయాత్ర ఉండదు కానీ దానితో సమానమైన యాత్ర ఉంటుందని నాగబాబు ప్రకటించారు. దానికి తగ్గట్లుగా అక్టోబర్ నుంచి యాత్ర ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. గతంలో పవన్ కల్యాణ్ బస్సుయాత్రల్లాంటివి చేశారు.ఈ సారి కూడా బస్సు యాత్రే చేస్తున్నారు. వచ్చే మార్చిలో ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నందున.. అక్టోబర్‌తో ప్రారంభించి ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే ఉండే అవకాశం ఉంది.
బలోపేతంపై బీజేపీ ఫోకస్..

ఏపీలో బీజేపీ కూడా పార్టీ బలోపేతంఫై ఫోకస్ పెట్టింది. పార్టీ అగ్రనేతలు వరుసగా పర్యటిస్తూ బీజేపీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. పొత్తులతో పని లేకుండా సొంతంగా ఎదగాలని భావిస్తున్నారు. ఎన్నికల నాటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించి శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న మూడు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు.
[…] Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీల… […]
[…] Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీల… […]