AP News: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరు. ఏది కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షం. కొండ మీద కోతినైనా తేవచ్చు. అవసరమైతే రోడ్డు మీద వెళ్లే వారిని సైతం ఆపి వారి వాహనం లాక్కోవచ్చు. ఏమైనా అంటే సీఎం ఆదేశాలు మీరు ఏదైనా దారి చూసుకోండి అని ఉన్న పళంగా వాహనాన్ని లాక్కెళ్లిపోతారు. ఇక వారికి దిక్కెవరు? కంచే చేను మేస్తే చేసేదేమిటి? అని లోలోపలే కుమిలిపోవడం తప్ప వారు చేసేది లేదని తెలుస్తోంది. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు జరిగింది. సాక్షాత్తు ఒంగోలు పట్టణంలోనే ఈ వింత చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం కారు కిరాయికి తీసుకుని శ్రీవారి దర్శనానికి తిరుమల బయలుదేరారు. వారు ఒంగోలు చేరుకోగానే ఆకలేస్తుందని ఓ హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నారు ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి కారు ఎవరిదని ప్రశ్నించారు. దీంతో తమదేనని చెప్పారు. అయితే మీరు వేరే వాహనం చూసుకోండి సీఎం కాన్వాయ్ కు కారు అవసరం ఉంది. అందుకే డ్రైవర్ తో సహా తీసుకుపోయాడు. దీంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుంటూ రోడ్డు మీదే నిలబడిపోయింది.
Also Read: Kamareddy Suicide Case: తెలంగాణలో అసహాయుల మరణాలు.. స్పందించని కేసీఆర్ సర్కార్
సీఎం కాన్వాయ్ కి ప్రైవేటు వాహనాలే కావాలా? తమ సొంత వాహనాలు ఉండవా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా వారు దేవుని దర్శనానికి వెళ్తుండగా వారి వాహనాన్ని తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా వస్తున్నాయి. అధికారంలో ఉంటే ఎవరికి గొప్ప ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఇలా దౌర్జన్యంగా లాక్కెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామని చెబుతున్నారు.
దీనిపై ఆ ఏరియా సీఐ మాట్లాడుతూ తమకు ఈ విషయం తెలియదని దాటేస్తున్నారు. వారి వాహనం తీసుకెళ్లినట్లు తెలిస్తే తమ వాహనం సమకూర్చే వారమని చెబుతున్నారు. పుణ్య క్షేత్రానికి వెళ్తున్న వారిపై జులుం చేయడం వివాదాలకు తావిస్తోంది. సీఎం జగన్ పాలన ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉందని ఇప్పటికే అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఎం వ్యవహార శైలి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోందని చెబుతున్నారు.
Also Read:Prashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?