KCR- Jagan: కెసిఆర్ కోసం… రాయలసీమను పణంగా పెట్టిన జగన్

ఆగస్టు రెండో వారం దాటుతోంది. రాయలసీమలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కొత్తగా పంటలు వేసేందుకు రైతులకు ధైర్యం చాలడం లేదు.

Written By: Dharma, Updated On : August 10, 2023 2:10 pm

KCR- Jagan

Follow us on

KCR- Jagan: రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ట్యాంకర్లలో నీటిని తెచ్చి తడులు అందిస్తున్నారు. కానీ వైసీపీ సర్కార్లో చలనం లేదు. పైగా ఇక్కడి సాగునీటి అవసరాలను పక్కనపెట్టి.. తెలంగాణకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు తహతలాడుతోంది. దీనిపై సీమ మేధావులు నోరెత్తడం లేదు.

ఆగస్టు రెండో వారం దాటుతోంది. రాయలసీమలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కొత్తగా పంటలు వేసేందుకు రైతులకు ధైర్యం చాలడం లేదు. రాయలసీమకు పెద్దదిక్కుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు విడుదల చేయడం లేదు. ఇటీవల వర్షాలకు శ్రీశైలంలో 100 టీఎంసీలకు పైగా నీరు చేరింది. తెలంగాణ ప్రభుత్వం అదే నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. దిగువకు నీరును విడిచిపెడుతోంది. ఏపీ సర్కార్ మాత్రం ఆ ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ నీటిని వృధా చేస్తుందని కృష్ణ బోర్డుకు లేఖ రాసి చేతులు దులుపుకుంది.

ఇటీవల వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పట్టిసీమ ద్వారా ఆ నీటిని కృష్ణ డెల్టాకు పంపడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. పట్టిసీమను రెండు మూడు రోజుల పాటు వినియోగంలోకి తెచ్చారు. ఇంతలో గోదావరి నీరు సముద్రంలోకి వృధాగా పోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పుడే నీరు చేరింది. కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. దిగువున ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు మాత్రం వెలవెలబోతున్నాయి. పొలాలకు చుక్కనీరు అందడం లేదు.

ఏపీ సాగునీటి అవసరాలు తీరకపోయినా.. తెలంగాణ విద్యుత్ అవసరాలకు మాత్రం ఏపీ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికల రానుండడంతో.. అక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తకూడదన్నది జగన్ సర్కార్ అభిమతం. అందుకు రాయలసీమ రైతాంగాన్ని పణంగా పెట్టడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై సీమ మేధావులు ప్రశ్నించకపోవడం గమనార్హం. అయితే ఇక్కడే జగన్ సర్కార్ తన తెలివితేటలను ప్రదర్శించింది. కృష్ణా జలాలను తెలంగాణ సర్కార్ వృధా చేస్తోందని కృష్ణా బోర్డు కు లేఖ రాసింది. తద్వారా ఏపీ ప్రజలు తనపై అనుమానం రాకుండా చూసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.