Chiranjeevi Vs Vijaysai Reddy: మెగాస్టార్ చిరంజీవి వైసీపీ సర్కార్ పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఈ కామెంట్ ఎవరిపైనా అన్న చర్చ ప్రారంభమైంది. ఇటీవల బ్రో సినిమా వివాదమే కారణమని అంతా భావించారు. కానీ అంతకంటే మించిన కారణం ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన్ను ఉద్దేశించే చిరు వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి రాజ్యసభలో సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు తీసుకురావాలని కోరారు. సినిమా అంటే ఒక్క హీరో యే కాదని.. చాలా విభాగాలు ఉన్నాయంటూ విజయ్ సాయి రెడ్డి గుర్తు చేశారు. దాన్ని ఉటంకిస్తూ చిరంజీవి మాట్లాడారు. హీరోలు వీలైనంత ఎక్కువ సినిమాలు చేయాలని చిరంజీవి సూచించారు. అలా చేస్తేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందన్నారు. అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు. హీరోల రెమ్యూనరేషన్ గురించి పెద్దల సభలో మాట్లాడుతున్నారని ఆయన ఇండైరెక్టుగా విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని ప్రస్తావించారు. దేశంలో ఏ సమస్య లేనట్లుగా కేవలం హీరోల రెమ్యూనరేషన్ సమస్య అయినట్టుగా పెద్దల సభలో మాట్లాడడం ఏమిటి అని అసహనం వ్యక్తం చేశారు. చేతనైతే సినిమాకు చేయూతనివ్వండి.. అంతేకానీ రెమ్యూనరేషన్ అంత ఎందుకని కామెంట్స్ చేయడమేంటని చిరు ఫైర్ అయ్యారు.
అయితే నాడు చిరంజీవి చాలా పద్ధతిగానే మాట్లాడారు. స్మూత్ గానే ఈ విషయాన్ని చెప్పారు. అయితే అప్పటికే ఏపీలో అంబటి వర్సెస్ బ్రో సినిమా మధ్య రచ్చ సాగుతోంది. పవన్ రెమ్యునరేషన్ విషయం గురించి అంబటి ప్రశ్నించారు. అదే సమయంలో చిరంజీవి మాట్లాడారు. అదే అంశంపై టచ్ చేశారు. దీంతో ఇది వివాదాస్పదమైంది. కానీ అసలు విషయం విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగమే. దానికి చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. అయితే విజయ్ సాయి అప్పట్లో సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించారు. కానీ బాలీవుడ్ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు.
టాలీవుడ్ నుంచి చిరంజీవి మాట్లాడే సరికి.. రాజకీయంగా మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవానికి సినీ రంగం సమస్యల వరకు చిరంజీవి ప్రస్తావించి ఉంటే ఏ సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ ప్రత్యేక హోదా, రహదారులు, ప్రాజెక్టులు వైఫల్యాలపై చిరంజీవి మాట్లాడే సరికి వైసీపీ నేతలు తట్టుకోలేకపోయారు. అందుకే చిరంజీవి వారి నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొన్నారు.