వికీలీక్స్.. ఈ పేరు వింటేనే సంపన్నుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఎంతో మంది ‘నల్ల రాయుడు’ల లిస్ట్ ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఎన్నో సంస్థల మోసాలనూ వెలుగు తీశాడు. ఇప్పుడు తాజాగా ఫిన్‌సెన్ లీక్స్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచంలో కుబేరులనే పేరు సంపాదించిన వారి బ్యాంకుల్లో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించారో ఈ ఫిన్‌సెన్ లీక్స్ బయట పెడుతోంది.
వికిలీక్స్, పనామా పేపర్స్ లాంటిది కాకుండా.. ఈ ఫిన్‌సెన్‌లీక్స్ అఫీషియల్. ఫిన్‌సెన్ అంటే.. అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్. ఈ విభాగానికి వివిధ బ్యాంకులు సమర్పించిన అనుమానిత కార్యకలాపాల నివేదిక ద్వారా అక్రమ లావాదేవీలు బట్ట బయలయ్యాయి. ఇందులో మన దేశంలోని ప్రముకుల పేర్లు కూడా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ముఖ్యంగా ఫిన్‌సెన్ లీక్స్‌లో కేవీపీ రామచంద్రారావు ప్రస్తావన కూడా ఉంది. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. కేవీపీ రామచంద్రరావుపై కేసు నమోదు చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టైటానియం ఖనిజ తవ్వకాల అనుమతుల కోసం లంచాలు వసూలు చేశారని కేవీపీకి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలను ఎఫ్‌బీఐ వెల్లడించినట్టు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బ్యాంకులు కూడా వీటి గురించి ఫిన్‌సెన్ లీక్స్‌లో బయటకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కేవీపీని తమకు అప్పగించాలని అమెరికా 2014లోనే కోరింది. అయితే అప్పట్లో కేవీపీ హైకోర్టులో పిటిషన్ వేసి బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఫిన్‌సెన్ లీక్స్‌లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఎఫ్‌బీఐ తన కేసులో కేవీపీతోపాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొంది.
టైటానియం స్కాం అక్రమ లావాదేవీలే కాకుండా అదానీ గ్రూపు వ్యవహారాలనూ ఫిన్‌సెన్ బయట పెట్టింది. సీషెల్స్ నుంచి సింగపూర్‌లోని అదానీ గ్లోబల్ పీటీఈ సంస్థకు మనీ లాండరింగ్ ద్వారా భారీ మొత్తంలో నిధులు బదిలీ అయినట్టు గుర్తించింది. ఫిన్‌సెన్‌కు బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ ఈ పత్రాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. థియోన్‌విల్లే ఫైనాన్షియర్ లిమిటెడ్ అదే పనిగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. 2013లో బీ థియోన్‌విల్లే ఫైనాన్షియర్ లిమిటెడ్ సంస్థ వెబ్‌సైట్ ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ అని చూపించేది. ఇప్పుడు కూడా ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో అదే ప్రకటనను కొనసాగిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినా లెక్కలు మాత్రం బయటకు రావాల్సి ఉంది.