అమరావతిలో ప్రభుత్వానికి గతంలో రైతులు అసైన్డ్ భూములను అప్పగించింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవి చెల్లవంటూ జీవో జారీ చేసింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు సైతం కేటాయించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం ఈ భూములపై కొరఢా ఝుళిపించడంతో విషయం కాస్త హైకోర్టుకు చేరింది. కోర్టు సైతం వైసీపీకి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయింది.
అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ భూముల్ని రాజధానికి ఇచ్చే సమయంలో అమ్ముకోవడంతో వీరికి ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు పొందేందుకు అర్హత లేదంటూ ప్రభుత్వం జీవో 316 తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. జీవో నెంబర్ 41 ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో వీరికి ప్లాట్లు కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను వైసీపీ సర్కారు వెనక్కి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వైసీపీ సర్కారు జారీ చేసిన జీవో 316 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు చెప్పినా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకే మొగ్గు చూపింది. దీంతో అమరావతిలో ఎదురుదెబ్బలు తిన్న వైసీసీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు గుబులు పుట్టించాయి.