
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ పట్నంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేలం వేసే బ్రోకరేజ్ సంస్థ ఎన్ బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది.
విశాఖలోని ఆగనంపూడి, ఫకిర్ టకియా ప్రాంతాల్లోని ఐదు స్థలాలతోపాటు బీచ్ రోడ్డులోని ఓ స్థలాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ఆగనంపూడి, ఫకిర్ టకియా ప్రాంతాల్లోని భూములు ఎకరం లోపే ఉండగా.. బీచ్ రోడ్డులోని భూమి మాత్రం సుమారు పదమూడు ఎకరాలు ఉంటుందని సమాచారం.
వందల కోట్ల విలువైన ఈ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్ వేశారు. గతంలోనే ‘బిల్డ్ ఏపీ’ పేరుతో భూములను విక్రయించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నించగా.. హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ.. మరోసారి సర్కారు భూములను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇరువర్గాల వాదనలు విన్న ప్రభుత్వం.. భూముల అమ్మకాలపై మరోసారి స్టే ఇచ్చింది. గతంలో ‘బిల్డ్ ఏపీ’ భూముల విక్రయం కేసులో ఇచ్చిన ఆదేశాలే.. ఇప్పుడు అమ్మాలనుకున్న భూములకు సైతం వర్తిస్తాయని చెప్పింది. అదేవిధంగా.. టెండర్లు ఫైనల్ చేయొద్దని కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. అమ్మకాల ప్రక్రియ మొత్తం నిలిచిపోనుంది.