ఏపీ ప్రభుత్వం మరోసారి విమర్శలపాలైంది. మిడిమిడి జ్ఞానంతో కంపెనీలు నెలకొల్పేందుకు ఇస్తున్న పర్మిషన్లు నవ్వులపాలు జేస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి ఓ లేఖ రాసింది. పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి విశాఖలో పాతిక ఎకరాల స్థలం ఇస్తామని.. పెట్టుబడులు పెట్టాలని లేఖ రాశారు. ఈ లేఖ చూసి.. ఇండస్ట్రీ వర్గాలు పకపకా నవ్వుకుంటున్నాయి. ఎందుకంటే.. ఈ ఫ్రాంక్టిన్ టెంపుల్టన్ కంపెనీని ఈ ప్రభుత్వ పెద్దలు ఎంత దారుణంగా అవమానించారో.. ఎంత కామెడీ చేశారో ఇంకా కళ్ల ముందే ఉంది. ఇప్పుడు అదే కంపెనీని మళ్లీ ఆహ్వానించడంపై అందరూ నోరెళ్లబెడుతున్నారు.
కియా పరిశ్రమ ఏపీ నుంచి వెళ్లిపోతోందని రాయిటర్స్ సంస్థ వార్త ప్రచురించినప్పుడు.. లోక్‌సభలో రగడ జరిగింది. ఆ సమయంలో.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని డమ్మీ కంపెనీగా సాక్షాత్తూ లోక్‌సభలోనే పేర్కొన్నారు. రూ.30 కోట్ల పెట్టుబడికి వెయ్యి కోట్లు విలువ చేసే భూములు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ అని.. అదో పెద్ద స్కాం అని ఆరోపించారు. దీనిపై.. అప్పట్లో స్వయంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ కూడా స్పందించింది. తాము ఎంత పెద్ద కంపెనీనో.. తన గొప్ప తనమేంటో.. తమ వెబ్ సైట్ చూసి తెలుసుకోవాలని ట్వీట్ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన, పెట్టాలనుకున్న మల్టీనేషనల్ కంపెనీలను.. వైసీపీ నేతలు అవమానపరిచారని ఇండస్ట్రీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం పెద్దలు నానా తిప్పలు పడి అక్కడా ఇక్కడా తిరిగి.. బతిమాలో బామాలో తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ వెళ్లగొట్టేశారు. భూముల కేటాయింపులు రద్దు చేశారు. అందులో ఫార్ట్యూన్ -500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా ఉంది. విశాఖలో 40 ఎకరాల స్థలంలో హై ఎండ్ ఉద్యోగాలను కల్పించే ఒప్పందంతో.. ఆ సంస్థ తమ సంస్థను అక్కడ పెట్టడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. వైసీపీ సర్కార్ అది భూమాయ అంటూ రద్దు చేసేసింది. అంతేకాదు.. ఆ పార్టీకి చెందిన వారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
కానీ.. అదే కంపెనీని ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థిస్తున్నారు. ఫార్ఛ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనూ ఆ కంపెనీ ప్రముఖంగా ఉంది. ఈ కంపెనీ తమ ప్రీమియమ్ ఆఫీసును విశాఖలో పెట్టాలని నిర్ణయించుకుంది. గత ప్రభుత్వం భూములు సైతం కేటాయించింది. ఆ కంపెనీ విశాఖకు రావడం వల్ల.. ఇతర ఐటీ కంపెనీల దృష్టి విశాఖపై పడుతుందని.. ఒకప్పుడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ ఎలాగో ఇప్పుడు విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అలా మారుతుందని భావించారు. తీరా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని రాకుండా చేశారు. దాంతో.. విశాఖ ఐటీ రంగం ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లయింది. ఇప్పుడు ప్రభుత్వం తప్పు తెలుసుకొని వెల్‌కమ్ చెబుతోంది. మరి ఆ కంపెనీ అవమాన పడ్డ చోటికి వస్తుందా.. లేక హ్యాండిస్తుందా అనేది చూడాలి.