చంద్రబాబు నాయుడు ఈ పేరు నిన్న మొన్నటిదాకా ప్రతిష్టతో ఓ వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు రోజు రోజుకూ మసకబారుతుంది. వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే వున్నాయి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ దెబ్బ దెబ్బమీద తీస్తూనే వున్నాడు. జగన్ దెబ్బకు భయపడి తిరిగి మోడీ కి దగ్గర కావటానికి పడరానిపాట్లు పడుతున్నాడు. ముందుగా ఎన్నికల్లో మోడీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి తప్పుచేశానని బహిరంగంగా లెంప లేసుకున్నాడు. దానితోపాటు తనకు కుడి ఎడమ భుజాలనుకున్న వాళ్ళను బిజెపి లోకి పంపించాడు. అంతటితో ఆగలేదు. తిరిగి మోడీ-అమిత్ షా లకు దగ్గరకావటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. పద్మశ్రీ గ్రహీత ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి ని వాళ్ళ దగ్గరకు రాయబారం పంపించాడు. ఆయనే స్వయంగా పెట్టిన పోస్టింగ్ ప్రకారం ఇంకెప్పుడూ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేవద్దని చెప్పారని, ఇంకెప్పుడు జీవితంలో తనను నమ్మలేమని కరాఖండిగా చెప్పినట్లు ప్రకటించాడు. అయినా తను చెయ్యని ప్రయత్నం లేదు. నాగపూర్ వెళ్లి ఆర్ ఎస్ ఎస్ పెద్దలని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా ఏమీ సత్ఫలితం వచ్చినట్లు లేదు. బిజెపి వైపునుంచి తలుపులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు.
దానికి బలం చేకూరేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు కి బద్ద వ్యతిరేకయిన సోము వీర్రాజు ని నియమించారు. ఆయన నియామకం తర్వాత మొదటిసారి టివి చానలుకు ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడ్డాడు. ఆయన ఆగ్రహానికి అర్ధంలేకపోలేదు. 2014 ఎన్నికల్లో మోడీ గాలి లో మోడీ మద్దత్తు తో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రం లో బిజెపి ని దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఒకవైపు కేంద్రం తో సఖ్యత తో వుంటూనే తన అనుకూల పత్రికల్లో ప్రతిరోజూ బిజెపి ని, కేంద్రాన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేసాడు. ఇదంతా తన మేధావితనం గా భావించాడు. కానీ బిజెపి లోని పాతకాపులకు ఇది అర్ధమయ్యింది. అందుకే రామ్ మాధవ్ చంద్రబాబు నాయుడు విషయం లో కటువుగానే మాట్లాడాడు. ఈ వ్యూహాలు అర్ధం చేసుకోలేనంత అమాయకులేం కాదు బిజెపి నాయకులు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బిజెపి పై, మోడీ పై ఒక్కపెట్టున దాడి మొదలుపెట్టాడు. అప్పటికే ఆ భూమికను తయారుచేసిన అనుకూల పత్రికలూ, చానళ్ళు ఇంకేముంది రెచ్చిపోయారు. అసలు ఆంధ్ర సమస్యలన్నింటికీ మూలం మోడీ నే నని ప్రచారం చేసారు. అందుకోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తో కూడా కలిసిపోయారు. మోడీ కన్నా తనే సీనియర్ నని మోడీ వ్యతిరేక కూటమి అధికారం లోకి వస్తే ప్రధానమంత్రి అభ్యర్ధుల్లో తనకే అవకాశం వుందని కూడా ఈ మీడియా ప్రచారం చేసాయి. కోల్ కతా బహిరంగ సమావేశం లో మమతా బెనర్జీ తో కలిసి మోడీని తిట్టారు. ఇదంతా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం గమనిస్తూనే వుంది. అందుకే మరలా దగ్గర కావాలని చేసిన లాబీ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీని పర్యవసానమే వీర్రాజు చంద్రబాబు పై నిప్పులు చెరగటం.
సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఖంగు తిన్న చంద్రబాబు కి అంతకన్నా పెద్ద షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు పై విరుచుకు పడ్డాడు. అసలు చంద్రబాబంత పచ్చి అవకాశవాది ఇంకొకరు ఉండరని ఏకి పారేశాడు. ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని తెలిసి కూడా తన నియోజక వర్గ ప్రచారాన్ని వదిలిపెట్టి చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూక్ అబ్దుల్లా ప్రచారానికి వస్తే తనన్ని గృహ నిర్బంధం చేస్తే ఖండిస్తూ ప్రకటన కూడా ఇవ్వలేదు. కాశ్మీర్ కాదుగదా ఎయిర్ పోర్ట్ కి కూడా రావటానికి ప్రయత్నం చేయలేదని, ఇటువంటి అవకాశవాది ని తన జీవితంలో చూడలేదని తను వాడుకొని వదిలేసే రకమని చెప్పకనే చెప్పాడు. ఇంతకన్నా అవమానం నాయకుడికేముంటుంది? అయినా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దానిపై స్పందించలేదు. ఎన్నికలయిన తర్వాత ఒక్కసారి కూడా యు పిఎ లోని ఏ నాయకుడి తోటి మాట్లాడలేదు. ఎన్నికలముందు కూటమి కి అంతా తానై ప్రవర్తించిన వ్యక్తి కూటమి ఓటమి పాలవటం తో ఒక్కసారి ప్లేటు ఫిరాయించటం వాళ్లకు చంద్రబాబు పై ఆగ్రహంగా వుంది.
ఇప్పుడు పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలాగా తయారయ్యింది. అటు యు పి ఎ , ఇటు బిజెపి రెండూ చంద్రబాబు పేరు చెప్పితేనే అసహ్యించుకునే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. గత చరిత్రలో రెండు మచ్చలు వెంటాడేవి. ఒకటి మామను వెన్నుపోటు పొడిచాడని ఆ మనో వ్యధ తోనే ఎన్ టి ఆర్ చనిపోయాడనేది. రెండోది వంగవీటి మోహన రంగా హత్యకు స్కెచ్ గీసిన సూత్రధారి చంద్రబాబు నాయుడే ననేది. అయినా ప్రజలు వాటిని మరిచిపోయి చంద్రబాబు కి పట్టం కడితే మరలా కుక్క తోక వంకరేనని నిరూపించుకున్నాడని జనం చెప్పుకుంటున్నారు. ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ క్యారక్టర్ పోతే తిరిగి రాదు అని చంద్రబాబు తెలుసుకోలేకపోయాడు. పాపం చంద్రబాబు ఇప్పుడు నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. చంద్రబాబు కనబడితే అయ్యో పాపం అనాలనిపిస్తుంది .