Good News From AP Govt: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది, 2023 జనవరి నుంచి పింఛను మొత్తాన్ని రూ.2,750కు పెంచనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3000 పింఛను అందించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో 62 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్టు ప్రకటించిన సీఎం… జనవరి నుంచి లబ్ధిదారుల సంఖ్య పెంచనున్నట్టు చెప్పారు. గత ఎన్నికల ముందు విపక్ష నేతగా సీఎం జగన్ నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వస్తే రూ.3,000కు పింఛన్ మొత్తాన్ని పెంచనున్నట్టు స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత రూ..2,250తో సరిపుచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏడాదికి రూ.250 చొప్పున పెంచి రూ.3,000 చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే మూడున్నరేళ్ల పాలన ముగించుకున్న వైసీపీ సర్కారు ఇప్పటివరకూ పెంచింది కేవలం రెండుసార్లే. ప్రస్తుతం లబ్ధిదారుడికి రూ.2,500 అందిస్తున్నారు. జనవరి నుంచి మరో రూ.250 పెంచనున్నారు. రూ.2,750 లెక్కన అందించనున్నారు. అంటే అక్కడికి ఎన్నిలకు ఏడాదే గడువు ఉంటుంది. చివరి రెండు నెలల్లో రూ.3,000 కు పెంచి ఎన్నికల హామీ అమలుచేశామని చెప్పుకోనున్నారు.

అయితే పింఛన్ల పంపిణీలోమరో విప్లవాత్మక మార్పునకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. పింఛన్ లబ్ధిదారుడు ఎక్కడ నుంచైనా పింఛన్ పొందేందుకు అవకాశం కల్పించారు. చాలామంది వేర్వేరు కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంత స్వగ్రామాలకు వచ్చి పింఛన్ తీసుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. దీనిపై విన్నపాలు వెల్లువెత్తిన తరుణంలోవీరంతా ఎక్కడ కోరుకుంటే అక్కడే పింఛన్ అందేలా చర్యలు చేపడుతున్నారు. అయితే తాము ఎక్కడి నుంచి పింఛన్ పొందాలనుకుంటున్నారో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు అనర్హత పింఛన్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎవరికైనా అనర్హులకు పింఛన్ మంజూరు చేసినట్టు తేలితే సంబంధిత అధికారి నుంచి ఆమొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ సిఫారసులు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రతి గ్రామం నుంచి అనర్హులకు పింఛన్లుమంజూరయ్యాయి కూడా. రాజకీయ సిఫారసులకు తలొగ్గి తప్పు అని తెలిసిన అధికారులు మంజూరు చేస్తూవచ్చారు. అభ్యంతరంవ్యక్తం చేస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం గురికాక తప్పదని భావించి ఆ పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో అధికారులు భయపడుతున్నారు.