
AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ఆశలు తీరడం లేదు. పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు అంశాలపై ఉద్యోగ సంఘాలు పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయి. ప్రభుత్వం తీరుస్తుందని అనుకున్నా సాధ్యం కావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అనుకున్నా అవి అడియాశలే అవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉద్యోగుల కోరికలను త్వరలోనే తీరుస్తామని చెప్పడం గమనార్హం.
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ దిగజారిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల డిమాండ్ల ప్రస్తావన చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదని అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో ఫిట్ మెంట్ 23 శాతం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేస్తోంది. ఇప్పటికే ఇస్తున్న 27 శాతం ఫిట్ మెంట్ గా ఖరారు చేసే అవకాశాలుంటాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తాత్కాలిక ఉపశమనం కోసం ఐఆర్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం.

ఐఆర్ నే ఫిట్ మెంట్ గా ఖరారు చేయడం ఎంత మాత్రం సరికాదని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీపై మరో పదిరోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాస రావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై తేల్చాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఉద్యోగుల సమస్యలపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సమస్య ల కారణంగా ప్రభుత్వం ఇచ్చే ఫిట్ మెంట్ ఖరారు చేయాల్సి ఉన్నా ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫిట్ మెంట్ ఏపీలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం సరైన హామీ ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన పెరుగుతోంది.